TTDP meeting
-
మోత్కుపల్లి X రేవంత్.. ఘాటు వ్యాఖ్యలు.. మోత్కుపల్లి వాకౌట్!
-
మోత్కుపల్లి X రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఊహించినట్టుగానే టీటీడీపీ నేతల భేటీ హాట్‌హాట్‌గా సాగింది. రెండు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో రేవంత్ వ్యవహారంపై వాడీవేడిగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని భావిస్తున్న రేవంత్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, అరవింద్‌కుమార్ గౌడ్ మండిపడ్డట్టు సమాచారం. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు ఎవరెవరిని కలిశారో చెప్పాలని రేవంత్‌ను మోత్కుపల్లి నిలదీశారు. కాంగ్రెస్ పార్టీతో చర్చలు ఎందుకు జరిపారని ఆయనను ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో చర్చలు జరిపే అధికారం మీకు ఎవరు ఇచ్చారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మోత్కుపల్లి ప్రశ్నలకు రేవంత్ దీటుగా సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. అన్ని విషయాలూ చంద్రబాబుకే చెప్తానంటూ రేవంత్ ఎదురుదాడికి దిగారని తెలుస్తోంది. చంద్రబాబుతోనే అన్నీ తేల్చుకుంటానని తెగేసి చెప్పినట్టు సమాచారం. మోత్కుపల్లి వర్సెత్ రేవంత్‌రెడ్డి ఏపీ టీడీపీ నేతలపై రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపైనా సమావేశంలో ఘాటుగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఏపీ నేతలు యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్‌లపై ఎందుకు ఆరోపణలు గుప్పించావని రేవంత్‌ను మోత్కుపల్లి మరోసారి నిలదీసినట్టు సమాచారం. ఢిల్లీ వ్యవహారాలపై చంద్రబాబుకే క్లారిటీ ఇస్తానని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. కాంగ్రెస్‌తో పొత్తు ఎలా సాధ్యమని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ప్రశ్నించగా.. నేనెవరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని రేవంత్ ఘాటుగా బదులిచ్చినట్టు సమాచారం. రేవంత్ సమాధానాలతో అసహనానికి గురైన మోత్కుపల్లి, అరవింద్‌కుమార్ గౌడ్ ఓ దశలో వాకౌట్ చేసినట్టు తెలుస్తోంది. ఆ విషయం గుర్తుంచుకోండి: రేవంత్‌రెడ్డి ఇన్నాళ్లు పార్టీ కోసం ఎవరేం చేశారో అందరికీ తెలుసంటూ చంద్రబాబు అనుకూల వర్గం నేతలపై రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. పార్టీ కోసం నేను జైలుకు వెళ్లానని, ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. త్వరలో అందరి సంగతి తెలుస్తా.. ఇంకా చాలా విషయాలు బయటపెడతా అని ఆయన హెచ్చరించారు. ఏ విషయం దాచిపెట్టాల్సిన అవసరం తనకు లేదని, సరైన సమయంలో అన్ని వివరాలు వెల్లడిస్తానని రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. మోత్కుపల్లి వర్సెత్ రేవంత్‌రెడ్డి -
అంతు చిక్కని రేవంత్ వ్యూహం..
-
అంతు చిక్కని రేవంత్ వ్యూహం.. సిటీకి లోకేశ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యూహం ఏమిటి? ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? టీడీపీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటే.. మరీ తెలంగాణ నేతల ప్రత్యేక సమావేశానికి ఎందుకు హాజరైనట్టు.. ఇప్పుడు ఇదే అంశం టీడీపీ శ్రేణుల్లో, చంద్రబాబు వర్గం నేతల్లో అయోమయానికి తావిస్తోంది. రేవంత్ వ్యవహారంపై చర్చించేందుకు బాస్ చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీపీ నేతలు శుక్రవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సమావేశానికి రేవంత్ హాజరుకావడంతో బాబు అనుకూల వర్గం నేతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారని సమాచారం. ఈ ప్రత్యేక భేటీ ప్రధాన అజెండా రేవంత్ పార్టీ మార్పు.. ఆయనే రావడంతో, ఇక ఏం చర్చించాలనే దానిపై వారు తర్జనభర్జన పడ్డారని తెలుస్తోంది. ఈ సమావేశానికి వచ్చిన వారిలో మెజారిటీ నేతలు రేవంత్ వ్యతిరేకులే ఉండటం గమనార్హం. ఇక చంద్రబాబు అనుకూల నేతల తీరుపై రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఏపీ టీడీపీ నేతలు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కుమ్మక్కైనా.. పట్టించుకోకుండా తనను టార్గెట్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నన్ను జైల్లో పెట్టిన వ్యక్తి (కేసీఆర్)తో మీరు ఎలా అంటకాగుతారు? పార్టీ కోసం నేను పోరాడుతుంటే వాళ్లు (ఏపీ నేతలు) కాంట్రాక్టులు ఎలా తీసుకుంటారు? ఇలాగైతే పార్టీ ఎలా మనుగడ సాగిస్తుంది' అని రేవంత్ చంద్రబాబు అనుకూల వర్గం నేతలను నిలదీసినట్టు తెలుస్తోంది. అదేసమయంలో చంద్రబాబు అండ్ కో నేతలు కూడా రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీతో అంటకాగడం సరికాదని రేవంత్‌కు బాబు అనుకూల నేతలు హితవు పలికినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో లోకేశ్ మకాం రేవంత్‌రెడ్డి వ్యవహారం తెలంగాణ టీడీపీలో కలకలం రేపుతున్న నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేశ్ హైదరాబాద్‌లో మకాం వేశారు. తెలంగాణ టీడీపీలో జరుగుతున్న పరిణామాలను ఆయన ఆరా తీస్తున్నారు. మూడురోజులపాటు లోకేశ్ హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. లోకేశ్ డైరెక్షన్లోనే చంద్రబాబు అనుకూల నేతలు రేవంత్ వ్యవహారంలో పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అమరావతిలో రెండురోజుల క్రితం లోకేశ్‌ను టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వీరయ్య కలిసిన సంగతి తెలిసిందే. -
కొత్త ట్విస్ట్: రేవంత్ హాజరు.. కంగుతిన్న నేతలు!
సాక్షి, హైదరాబాద్: రేవంత్‌రెడ్డి పార్టీ మారుతారన్న ఊహాగానాల నేపథ్యంలో టీటీడీపీ పొలిట్‌బ్యూరో, సెంట్రల్ కమిటీ సభ్యులు శుక్రవారం ఎన్టీఆర్ భవన్లో సమావేశమయ్యారు. ఈ భేటీకి అసమ్మతి నేత రేవంత్‌రెడ్డి సైతం హాజరుకావడం గమనార్హం. రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారంపై ప్రధానంగా చర్చించేందుకు ఈ భేటీ జరుగుతోంది. రేవంత్ తాజా కదలికలు, ఆరోపణలు టీడీపీలో కలవరం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై జరుగుతున్న సమావేశానికి రేవంత్ సైతం హాజరవ్వడం ఆసక్తి రేపుతోంది. అనూహ్యంగా ఈ భేటీకి రేవంత్ హాజరుకావడంతో తెలంగాణ టీడీపీ నేతలు కంగుతిన్నారని తెలుస్తోంది. ఈ సమావేశానికి హాజరైన వారిలో మెజారిటీ నేతలు రేవంత్ వ్యతిరేకులే ఉండటం గమనార్హం. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు జరుగుతున్నఈ భేటీలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు. రేవంత్‌రెడ్డి ఉదయమే ఎన్టీఆర్ భవన్‌కు వచ్చివెళ్లారని, తాను కూడా పొలిట్‌బ్యూరో సభ్యుడు కావడంతో ఈ భేటీకి హాజరుకానున్నట్టు ఆయన సమాచారం అందించారని పార్టీ వర్గాలు ఇంతకుమునుపు తెలిపాయి. రేవంత్‌రెడ్డి పార్టీ మార్పు అంశమే ఈ సమావేశానికి ప్రధాన అజెండా అని సమాచారం. ఈ సమావేశానికి రేవంత్‌రెడ్డి హాజరైన నేపథ్యంలో.. పార్టీ మార్పుపై ఆయనను వివరణ అడిగే అవకాశముందని తెలుస్తోంది. కాంగ్రెస్ గూటికి ఖాయమా? ఢిల్లీలో కాంగ్రెస్ అధినాయకత్వంతో భేటీ కావడం, అనంతరం ఏపీ టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించడం వంటి పరిణామాలను గమనిస్తే.. రేవంత్ రెడ్డి పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తున్నదని తెలంగాణ తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో ఇంకా ఎవరెవరు పార్టీని వీడబోతున్నారన్న చర్చ టీటీడీపీలో జరుగుతోంది. కనీసం 16 జిల్లాల టీడీపీ అధ్యక్షులు కూడా రేవంత్‌తోపాటు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని అంటున్నారు. మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు కూడా అదే బాటలో ఉన్నారని తెలిసింది. భూపాలపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, వికారాబాద్, మేడ్చల్, సూర్యాపేట జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పార్టీ కేడర్ మారే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే జరిగితే దాదాపు తెలంగాణ టీడీపీ ఖాళీ అయినట్లే అని బలమైన అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, సీనియర్ నేత మోత్కుపల్లి వంటి నేతలే పార్టీలో మిగిలే సూచనలు కనిపిస్తున్నాయి. -
తెలంగాణ టీడీఎల్పీ సమావేశం విజయవాడలోనా?
తెలంగాణ పచ్చ తమ్ముళ్లపై మంత్రి హరీశ్ మండిపాటు బాన్సువాడః తెలంగాణలోని టీడీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వత్తాసు పలుకుతూ, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణ టీడీఎల్పీ సమావేశాన్ని విజయవాడలో నిర్వహించడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణ టీడీపీ నేతలను త్వరలో ప్రజలే తరిమికొడతారని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే వ్యతిరేకించారని, అలాగే డిండి ప్రాజెక్టును, వాటర్ గ్రిడ్ పనులను వ్యతిరేకించారని, చంద్రబాబు డెరైక్షన్‌లో టీడీపీ నేతలు యాక్షన్ చేస్తున్నారని హరీశ్ విమర్శించారు.