సమావేశం అనంతరం కారులో వెళుతున్న రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన టీడీపీ సీనియర్లంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అమ్ముడుపోయారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఆపార్టీ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. పార్టీలో తాజా పరిణామాలపై టీటీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు నాయుడు శుక్రవారం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథిగృహంలో సమావేశమయ్యారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, అరవింద్‌కుమార్‌గౌడ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇటీవలికాలంలో జరిగిన పరిణామాలను ఎల్.రమణ వివరించారు. రమణ ఇచ్చిన వివరణ పూర్తికావడంతోనే మోత్కుపల్లి నర్సింహులు, అరవింద్‌కుమార్‌గౌడ్ జోక్యం చేసుకుంటూ రేవంత్‌రెడ్డిపై ఫిర్యాదు చేసే విధంగా మాట్లాడే ప్రయత్నం చేశారు.
అయితే వారిని చంద్రబాబు వారించారు. ఈ అంశంపై ఇప్పుడు మాట్లాడాల్సిందేమీ లేదని, శనివారం అమరావతికి వస్తే దానిపై వివరంగా మాట్లాడుకుందామని చంద్రబాబు అన్నారు. దీనితో మోత్కుపల్లి, అరవింద్‌కుమార్ ఏమీ మాట్లాడలేకపోయారు. ఎల్.రమణ నివేదిక ఇచ్చిన సమయంలోనూ, మోత్కుపల్లి తదితరులు ఫిర్యాదు చేసే సమయంలోనూ రేవంత్‌రెడ్డి అదే సమావేశంలో ఉన్నా ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ కూర్చున్నారు. అనంతరం చంద్రబాబుతో రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా కొద్దిసేపు సమావేశమయ్యారు.
పైరవీలు, పైసల కోసమే..: రేవంత్ రెడ్డి
‘టీటీడీపీ సీనియర్లంతా సీఎం కేసీఆర్‌తో కుమ్మక్కయ్యారు. టీడీపీని గంపగుత్తాగా కేసీఆర్‌కు అప్పగించాలన్నది వారి ప్రయత్నం’ అని రేవంత్‌రెడ్డి చంద్రబాబుకు వివరించారని సమాచారం. ‘టీడీపీలో ఉంటూనే ఈ నేతలంతా కేసీఆర్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారు. పైరవీలకోసం, పైసలకోసం వీళ్లంతా టీడీపీని నాశనం చేసి కేసీఆర్‌కు లాభం చేయడానికి ప్రయత్నిస్తున్నారు’ అని రేవంత్ ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ఓడించాలని తనలాంటి కార్యకర్తలు పనిచేస్తుంటే దానికి గండికొట్టేవిధంగా సీనియర్లు ప్రయత్నం చేస్తున్నారన్నారు.
సీనియర్లు పార్టీని బతకనిచ్చే పరిస్థితి లేదని, ఒకవేళ బీజేపీతో కలసి టీడీపీని బలోపేతం చేయాలనుకుంటే త్రిముఖ పోటీతో జరిగే ఓట్లచీలికతో టీఆర్‌ఎస్‌కు లాభం అవుతుందని రేవంత్ వివరించారు. దీనికి చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. అమరావతిలో శనివారం అన్ని విషయాలపై చర్చించుకుందామని రేవంత్‌రెడ్డికి చంద్రబాబు సూచించారు. అమరావతిలో చంద్రబాబుతో సమావేశం జరిగిన తర్వాత టీడీపీకి రేవంత్‌రెడ్డి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment