సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యయుగాల చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేత, ఎమ్మె ల్యే రేవంత్‌రెడ్డి ఆరో పించారు. ట్రాక్టర్లపై ప్రజారవాణా నేరమని, ట్రాక్టర్ల ద్వారా ప్రజలను తరలించాలని చెప్పడం ద్వారా కేసీఆర్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్నారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రగతి నివేదన సభ పేరుతో కేసీఆర్, టీఆర్‌ఎస్ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. హరితహారం పేరుతో చెట్లు నాటినట్లు పోజులిచ్చిన సినిమా నటులు ఇప్పుడు కొంగరకలాన్‌లో వేల చెట్లు నరికివేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులైన బలవంతంగా కళాకారులతో టీఆర్‌ఎస్ సభలో పాటలు పాడించుకుంటున్నారని వీటిని కోర్టు సుమోటోగా తీసుకుని కేసులు దాఖలు చేయాలన్నారు.
‘ప్రగతి నివేదన సభను అడ్డుకుంటాం’
హైదరాబాద్: గిరిజనులను మోసం చేసిన సీఎం కేసీఆర్ తలపెట్టిన ప్రగతి నివేదన సభను 5వేల మంది గిరిజనులతో అడ్డుకుంటామని సేవాలాల్ బంజార సంఘం హెచ్చరించింది. సభకు వ్యతిరేకంగా శనివారం ఎల్బీ నగర్‌లోని బీఆర్ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రాం విగ్రహాల వద్ద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోతిలాల్‌నాయక్, ప్రధాన కార్యదర్శి గాంధీనాయక్, ఇతర నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడగానే గిరిజన రిజర్వేషన్ జీవోపై సంతకం పెడతామని హామీ ఇచ్చి నాలుగున్నరేళ్లు దాటినా జీవో ఊసే లేదన్నారు. టీఆర్‌ఎస్‌ది ప్రగతి నివేదన సభ కాదు లంబాడీలను గోస పెట్టే సభని మండిపడ్డారు. సభకు వచ్చే వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment