సాక్షి, తిరుపతి : నగరి అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆర్కే రోజా నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు శుక్రవారం నగరి తహశీల్దార్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రజలంతా వైఎస్సార్ సీపీ వైపే చూస్తున్నారని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కక్ష సాధింపు ధోరణి అవలంబించిన చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమని, ఆయన పాలనలో నగరి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
పవన్ మాట మార్చారు..
టీడీపీ, జనసేన పార్టీలు కుమ్మక్కయ్యాయని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ అవినీతిని ప్రశ్నించిన పవన్ కల్యాణ్ తర్వాత మాట మార్చారని మండిపడ్డారు. నగరి నియోజకవర్గంలో దళితుల ఓట్లు చీల్చేందుకు ఇక్కడ బీఎస్పీకి సీటు కేటాయించారని విమర్శించారు. కాగా 2014 ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత, దివంగత గాలి ముద్దుకృష్ణమనాయుడుని ఓడించి రోజా ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి తనపై కక్షపూరితంగా వ్యవహరించిన టీడీపీ ప్రభుత్వం నగరి నియోజకవర్గానికి నిధులు విడుదల చేయకుండా ఇబ్బందులకు గురిచేశారని రోజా పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు.
జోరుగా నామినేషన్ల పర్వం
రాష్ట్రంలో నామినేషన్ల పర్వం జోరందుకుంది. శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో రాజంపేట పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి... ఎన్నికల అధికారి గిరీష వద్ద నామినేషన్ దాఖలు చేశారు. ఇక చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్సార్ సీపీ నేత రెడ్డప్ప, చిత్తూరు అసెంబ్లీ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీనివాసులు నామినేషన్ పత్రాలు సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment