మీడియాతో మాట్లాడుతున్న రోజా
నగరి: ప్రజల ఆశీర్వాదమే తన బలమని వైఎస్సార్‌సీపీ నగరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఆర్కే రోజా అన్నారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా ఓడించాలని చంద్రబాబు నీచరాజకీయాలకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఆయన ఆలోచనను జనం గ్రహించారని, అందుకే తన నామినేషన్ కార్యక్రమానికి ప్రతి ఊరి నుంచి భారీగా తరలివచ్చి తనను ఆశీర్వదించారని తెలిపారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించడం ఖాయమన్నారు. జగన్‌మోహన్ రెడ్డి వైఎస్సార్ కన్నా నాలుగు అడుగులు ముందుకేసి ప్రజలకు సేవ చేస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేగా నగరి సమస్యల గురించి అసెంబ్లీలో ఎన్నోసార్లు ప్రస్తావించానన్నారు. కొన్నింటిలో ఫలితాన్ని సాధించానని, కొన్నింటిని వారు చేయలేదని తెలిపారు. అనంతరం ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్లిన ఆమె రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. రోజా భర్త ఆర్కే సెల్వమణి, స్థానిక నాయకులు, పార్టీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కేజే కుమార్, రాష్ట్ర కార్యదర్శి చక్రపాణి రెడ్డి, బీసీ సెల్ కార్యదర్శి ఏలుమలై, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపతి రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment