రాజాసింగ్ (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోకి అక్రమంగా చొరబడిన రోహింగ్యాలను, బంగ్లాదేశీయులను కాల్చివేస్తేనే దేశం క్షేమంగా ఉంటుందని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జరిగిన ఓ సమావేశంలో రాజాసింగ్ మాట్లాడుతూ.. ‘అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారందరూ మర్యాదగా వెళ్లిపొండి. మీరు వెళ్లకపోతే కాల్చి చంపేయాల్సి వస్తుంది. మిమల్ని చంపేస్తేనే ఈ దేశం ప్రశాంతంగా ఉంటుంది’ అని అన్నారు.
అసోంలో నివసిస్తున్న 40 లక్షల మందిని అక్రమ చొరబాటుదారులుగా గుర్తిస్తూ.. ఎన్‌సీఆర్ (జాతీయ పౌర రిజిస్ట్రర్) జాబితాలో వారి పేర్లను తొలగించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తీవ్ర వివాదం నెలకొన్న నేపథ్యంలో రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అడ్డువచ్చిన వారి తలల నరికేస్తామని గతంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అసోం ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్‌సీఆర్ జాబితాపై ప్రతిపక్షాల ఆరోపణలను బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాలు పరోక్షంగా అక్రమ వలసదారులకు మద్దతునిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఎన్‌సీఆర్ చట్టం బీజేపీ తీసుకువచ్చింది కాదని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హయంలోనే దీనిని రూపొందించారని ఆయన గుర్తుచేశారు. ఎన్‌సీఆర్‌ను అమలుచేసే ధైర్యం కాంగ్రెస్ పార్టీకి లేక ఇన్ని రోజులు అమలుచేయాలేకపోయారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment