gosha mahal
-
‘గోషామహల్’ కోసం రాహుల్ సిప్లిగంజ్ దరఖాస్తు!
సాక్షి, హైదరాబాద్: గాంధీ భవన్ వద్ద ఇవాళ కోలాహలం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇవాళ చివరిరోజు కాగా.. దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. గోషామహాల్ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. దీంతో రాహుల్ రాజకీయ ఎంట్రీపై ఆసక్తి నెలకొంది. ఇక దరఖాస్తుల పరిశీలన తర్వాత.. ఆయా స్థానాలకు అభ్యర్థుల్ని పీసీసీ ఎంపిక చేస్తుంది. ఇప్పటి వరకు 900 దరఖాస్తులు దాటినట్లు తెలుస్తోంది. చివరి రోజు కావడంతో సాయంత్రం వరకు దరఖాస్తుల సంఖ్య వేయి దాటుతుందని గాంధీభవన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యూట్యూబర్‌గా లోకల్ సాంగ్స్‌తో పాపులర్ అయిన రాహుల్ సిప్లిగంజ్, ఆపై టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్‌గా అలరిస్తున్నారు. ఇప్పటిదాకా సుమారు 50కిపైగా చిత్రాల్లో పాడారు. రాహుల్ సిప్లిగంజ్ తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్-3 విజేతగానూ నిలిచారు. రాజమౌళి ట్రిపుల్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్‌కుగానూ ఆస్కార్ దక్కగా.. ఆ సాంగ్ సింగర్ అయిన రాహుల్‌కు ఆస్కార్ ఆ వేదికపైనా పాడి అలరించే అవకాశం దక్కింది కూడా. -
బీజేపీకి కొత్త టెన్షన్.. బీఆర్ఎస్తో టచ్‌లో ఐదుగురు నేతలు!
తెలంగాణ బీజేపీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కర్ణాటక ఎన్నికల్లో మాత్రం ఆయనతో ప్రచారం చేయించారు. ఇక్కడ మాత్రం సస్పెన్షన్ ఎత్తేయమని అడిగినా పట్టించుకోవడంలేదు. గోషామహల్లో కమలం పార్టీకి దిక్కులేకుండా పోయింది. ఇంతకీ రాజాసింగ్ సస్పెన్షన్ మీద పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి ఏమంటున్నారు?.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీలో ఫైర్ బ్రాండ్ లీడర్. నిరంతరం కాంట్రవర్సీ ప్రకటనలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఆ కాంట్రవర్సీలే ఆయన్ను కటకటాల్లోకి కూడా నెట్టాయి. వివాదాస్పద ప్రకటనల కారణంగానే పార్టీ హైకమాండ్ రాజాసింగ్‌ను సస్పెండ్ చేసింది. గత ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రస్తుతం ఎమ్మెల్మే ఎలాగూ తన పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు. దీంతో, నియోజకవర్గంలో బీజేపీ కార్యక్రమాలేవీ జరగడంలేదు. ఈ అవకాశంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గోషామహల్‌ను స్వాధీనం చేసుకోవాలని గులాబీ పార్టీ పట్టుదలతో వ్యవహరిస్తోంది. పార్టీ నాయకత్వం ఆదేశాలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ అసెంబ్లీ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటి నుంచీ నియోజకవర్గంలో పెద్దగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలేదు. గోషామహల్ బీజేపీ టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్‌కు పార్టీ నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో ఆయన కూడా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొనడంలేదు. ఒక పక్కన ఎమ్మెల్యే పార్టీ నుంచి దూరంగా ఉండటం, మరోవైపు పోటీ చేస్తానంటున్న నేతకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో గోషా మహల్‌లోని బీజేపీ కేడర్ అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది. గోషామహల్ నియోజకవర్గ పరిధిలో గెలిచిన ఐదుగురు బీజేపీ కార్పోరేటర్లు.. అధికార పార్టీ నేతలతో టచ్‌లో ఉంటూ పనులు చేయించుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. గోషామహల్లో లైన్ క్లియర్ చేస్తే పనిచేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని విక్రమ్ గౌడ్ మొరపెట్టుకుంటున్నా కమలం పార్టీలో ఆలకించే నాథులే లేరు. ఇక్కడేమో రాజాసింగ్ మీద పార్టీ సస్పెన్షన్ కొనసాగుతోంది. మరోవైపు కర్ణాటక ఎన్నికల్లో రాజాసింగ్ బీజేపీ తరఫున ప్రచారం చేయడంతో పార్టీలోనే హాట్ టాపిక్‌గా మారింది. రాజాసింగ్ విషయంలో బీజేపీ హైకమాండ్ ద్వంద్వ నీతితో వ్యవహరిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ రాష్ట్ర కమిటీ రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు ఎత్తేయాలని హైకమాండ్‌కు సిఫారసు చేసినా ఢిల్లీ నుంచి ఎలాంటి స్పందనా కనిపించడంలేదు. రాజాసింగ్ విషయంలో త్వరలోనే పార్టీ హైకమాండ్ సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. ఇదిలా ఉండగా.. గోషామహల్ బీజేపీ కార్యకర్తలు మాత్రం పార్టీ హైకమాండ్ నుంచి వచ్చే సిగ్నల్స్ కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గోషామహల్లో బీజేపీ జెండాను రాజాసింగే మోస్తారా? విక్రమ్ గౌడ్ చేతికిస్తారా? అనే ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఇది కూడా చదవండి: బీజేపీ అధినాయకత్వం వరుస భేటీలు.. ఢిల్లీలో ఏం జరుగుతోంది? -
ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదు
హైదరాబాద్: గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభాయత్ర సందర్భంగా రాజాసింగ్ ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎస్ఐ వీరబాబు ఫిర్యాదు చేశారు. దాంతో అఫ్జల్‌గంజ్ పీఎస్‌లో రాజాసింగ్‌పై కేసు నమోదు చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా తన కొడుకుని పరిచయం చేసే కార్యక్రమంలో ఇతర కమ్యూనిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రాజాసింగ్‌పై 153-A, 506 IPC సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. -
రాజాసింగ్‌కు మళ్లీ నోటీసులు.. భయపడేది లేదంటూ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి షోకాజ్ నోటీసులు ఇచ్చారు పోలీసులు. తాజాగా మంగళ్‌హాట్ పోలీసులు.. రాజాసింగ్‌కు నోటీసులు అందజేశారు. కాగా, నోటీసుల్లో కోర్టు పేర్కొన్న బెయిల్ షరతులను ఉల్లంఘించారని తెలిపారు. అంతకుముందు, పీడీ యాక్ట్ కేసులో రాజాసింగ్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇక, పోలీసుల నోటీసులపై రాజాసింగ్ స్పందించారు. రాజాసింగ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘నిజాం పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా, జైలుకు పంపినా భయపడేది లేదు. ధర్మం కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను.. గో హత్య, మతమార్పిడులు, లవ్ జిహాద్‌పై చట్టం చేయాలని కోరాను.. ఇందులో మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏం ఉన్నాయి. ముంబైలో పాల్గొన్న కార్యక్రమంలో మాట్లాడితే.. నాకు తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
BJP MLA Raja Singh: రాజాసింగ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా?
హైదరాబాద్జిల్లా అసెంబ్లీ నియోజక వర్గాలన్నిటిలోనూ కుల సమీకరణాలకంటే మత సమీకరణాలే కీలకం కానున్నాయి. అన్ని పార్టీలకు హిందుత్వమే కీలకం కానుంది. మజ్లిస్‌ను ఓడించాలంటే హిందుత్వతోనూ ముందుకు సాగాలని కమలనాథులు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఇక మిగిలిన పార్టీలు కూడా అదే బాటలో నడవక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. గెలుపునకు వారి ఓట్లే కీలకం గతంలో కాంగ్రెస్‌కు కంచుకోటలా ఉన్న గోషామహాల్ నియోజకవర్గం ఇప్పుడు బీజేపీకి కంచుకోటగా మారింది. గోషా మహల్‌ను వశం చేసుకునేందుకు కాంగ్రెస్, టిఆర్ఎస్ లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గోషామహల్లో ఎలాగైనా పాగా వేయాలని అన్ని పార్టీలు తహ తహలాడుతున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ కూడా అంతే తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ నియోజకవర్గంలో హిందూ ఓట్లే కీలకం కాబోతున్నాయి. గత రెండు ఎన్నికల్లో కూడా హిందూ ఓట్లే రాజాసింగ్‌ను గెలిపించాయని చెప్పక తప్పదు. గోషామహాల్ ఏరియాలో బేగం బజార్ అత్యంత కీలకం. ఇక్కడ షాపుల యజమానులందరూ మార్వాడీలే. ఇక్కడ ఈ వర్గం ఎవరికి మద్దతు ఇస్తే వారే గెలిచే అవకాశం ఉంది. అలాగే యాదవ, బెస్త, ముదిరాజ్, గౌడ సామాజిక వర్గాలు కూడా ఎక్కువగానే ఉన్నారు. అన్ని వర్గాలకు దగ్గర అయ్యేందుకు అన్ని పార్టీలు అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్ పై బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ 16 వేల ఓట్ల మెజారిటీ తో గెలిచారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఇక్కడ బలమైన అభ్యర్థిని దింపితే గెలుస్తామనే ధీమాను కాంగ్రెస్, టిఆర్ఎస్ లు వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంది. అయితే, తాజాగా ఆయనపై నమోదైన కేసులు.. బీజేపీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వెరసి రాజాసింగ్ రాజకీయ భవితవ్యాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. కాంగ్రెస్‌నేత ముఖేష్ గౌడ్ మృతి చెందడంతో... ఆ పార్టీ కొత్త అభ్యర్థిని బరిలో దించనుంది. ఫిషర్మెన్ కమిటీ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ , అంజన్ కుమార్ యాదవ్ చిన్న కొడుకు అరవింద్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. టిఆర్ఎస్ నుంచి మళ్ళీ ప్రేమ్ సింగ్ రాథోడ్ పోటీ చేసే అవకాశం ఉంది. (చదవండి: పవర్ఫుల్ పీడీ యాక్ట్.. అదే జరిగితే ఎమ్మెల్యే రాజాసింగ్ ఏడాది జైల్లోనే! ) ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ నుంచి ఎవరు? ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే.. అన్ని రంగాలకు చెందిన వీఐపీలు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులే కాకుండా.. ఫిలింనగర్ మురికివాడలు, బస్తీలు కనిపిస్తాయి. టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం, రాజ్ భవన్, మినిస్టర్ క్వార్టర్స్, ఎమ్మెల్యే కాలనీ సహా అనేక రంగాల కీలక కార్యాలయాలు ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. పి. జనార్థనరెడ్డి ఉన్నప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట. పీజేఆర్ మృతి, 2014లో తెలంగాణ ఏర్పాటుతో ఖైరతాబాద్ లో రాజకీయ సమీకరణాలు మారాయి. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పీజేఆర్ శిష్యుడు దానం నాగేందర్ ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత దానం టిఆర్ఎస్లో చేరి గత ఎన్నికల్లో గెలుపొందారు. ఖైరతాబాద్ లో పట్టు కోసం కాంగ్రెస్, బీజేపీ, టిఆర్ఎస్ లు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. టిఆర్ఎస్ నుంచి దానం నాగెందర్ మళ్ళీ బరిలోకి దిగే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకపోవడంతో బీఏస్పీ నుంచి పోటీ చేసిన మన్నె గోవర్ధన్ ఈసారి టిక్కెట్ తనకే అని ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ నుంచి చింతల రాంచంద్రారెడ్డి మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి ముగ్గురు నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో టిక్కెట్ ఆశించి భంగపడ్డ రోహిణ్ రెడ్డి ఈసారి కచ్చితంగా తనకే టిక్కెట్ ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు ఈ మధ్యే టిఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ లో చేరిన పీజేఆర్ కూతురు విజయారెడ్డి కూడా తనకే టిక్కెట్ అని చెబుతున్నారు. (చదవండి: సెప్టెంబర్ 7కు హైదర్‌నగర్ భూముల కేసు వాయిదా) సర్వేతో భయపడుతున్న కాలేరు అంబర్‌పేటలో రెండుసార్లు వరుసగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విజయం సాధించగా... గత ఎన్నికల్లో కిషన్‌రెడ్డి మీద టిఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో దెబ్బతిన్న బీజేపీ ఈసారి అలాంటి తప్పిదం జరగకుండా జాగ్రత్త పడుతోంది. ఇక్కడ ముస్లిం ఓటు బ్యాక్ ఎక్కువగానే ఉంది. దీంతో హిందూ, ముస్లిం ఎజెండాలో బీజేపీ ఈజీగా బయటపడుతుందని కమలనాధులు లెక్కలేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన కాలేరు వెంకటేష్ మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా మళ్ళీ తనకే టిక్కెట్ వస్తుందని కాలేరు వెంకటేష్ భావిస్తున్నారు. అయితే సర్వేలో మంచి మార్కులు వచ్చిన సిట్టింగ్ లకే మళ్ళీ టిక్కెట్ అనడంతో కాలేరుకు సర్వే భయం పట్టుకుందట. ఇక్కడ పార్టీ ఓట్‌బ్యాంక్‌తో పాటు.. మైనారిటీ ఓట్లతో గెలవవచ్చని గులాబీ పార్టీ భావిస్తోంది. అయితే ఎంఐఎం బలమైన అభ్యర్థిని బరిలో దింపితే అన్ని పార్టీలను ఇబ్బంది పెట్టే అవకాశం లేకపోలేదు. ఇక కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు లైన్ లో ఉన్నారు. అయితే వీహెచ్ ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ తన నియోజకవర్గంలో తాను చెప్పిన వారికే టిక్కెట్ ఇవ్వాలని అదిష్టానం ముందు మెలిక పెట్టారట వీహెచ్. ఫైనల్‌గా వీహెచ్ ఆశీర్వాదం ఉన్న వారికి ఇక్కడ కాంగ్రెస్ టిక్కెట్ దక్కుతుందని అంటున్నారు. గత ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడినందున ఇక్కడ కాంగ్రెస్ స్థానంలో టీజేఎస్ పోటీ చేసింది. అందువల్ల కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఇతర పార్టీలకు మళ్ళిందనే ఆందోళన కనిపిస్తోంది. (చదవండి: ఆ విషయం బీజేపీ ఎంపీకి ముందే ఎలా తెలుసు?) -
‘రాజీ’ ఎరుగని రాజా సింగ్.. దేశవ్యాప్తంగా కేసులే కేసులు
సాక్షి, హైదరాబాద్: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ ఎమ్మెల్యే ఠాకూర్ రాజాసింగ్ లోథ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీశాయి. అవసరమైతే ధర్మం కోసం తాను చనిపోయేందుకైనా సిద్ధం కానీ... వెనక్కి తగ్గనని ఆయన తేల్చిచెప్పారు. పోలీసులు ఇప్పటికే రాజాసింగ్‌ను అరెస్టు చేశారు. బీజేపీ అధిష్ఠానం కూడా ఆయన వ్యాఖ్యలపై సీరియస్ అయింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులు పంపింది. అయితే రాజాసింగ్‌కు వివాదాలు కొత్తేం కాదు. ఆయనపై ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. గతంలోనూ తీవ్ర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఆ వివరాలు.. ► రాజాసింగ్ రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైంది. ఆ తర్వాత బీజేపీలో చేరారు. 2014 నుంచి హైదరాబాద్‌లోని గోషామహల్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ► 2015లో ఓ పెళ్లి వేడుకలో డీజేను ఆపేందుకు వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించి రాజాసింగ్ మొదటిసారి వార్తల్లో నిలిచారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మ్యూజిక్ ప్లే చేస్తే ఆపేందుకు వెళ్లిన పోలీస్‌పై దాడి చేశాడు. దీంతో రాజాసింగ్‌పై కేసు నమోదైంది. ► అదే ఏడాది ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని ఓ వర్గం విద్యార్థులు ప్రకటించినప్పుడు రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గోమాతను రక్షించేందుకు ప్రాణలైనా అర్పిస్తాం, అవసరమైతే ప్రాణాలు తీస్తాం అని బెదిరించారు. ► 2018లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తనపై మొత్తం 43 కేసులు నమోదైనట్లు రాజాసింగ్ పేర్కొన్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం, విద్వేష ప్రసంగాలు, ప్రార్థనా స్థలాన్ని అపవిత్రం చేయడం, హత్యాయత్నం వంటి కేసులు తనపై ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు. ► 2020లో రాజాసింగ్‌ను ప్రమాదకరమైన వ్యక్తిగా ఫేస్బుక్ లేబుల్ చేసింది. ఆ ఏడాది సెప్టెంబర్‌లో విద్వేష ప్రసంగాలు చేసినందుకు ఆయనపై నిషేధం విధించింది. రోహింగ్యా ముస్లింలపై, ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై ఈ చర్యలు తీసుకుంది. ► 2022 ఏప్రిల్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. భారత్ త్వరలోనే హిందూ దేశంగా మారుతుందని ఆయన పాట కూడా పాడారు. ► గతవారం హైదరాబాద్‌లో మునావర్ ఫరుఖీ షో సందర్భంగా రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ షో వేదికను తగలబెడతానని బెదిరించారు. దీంతో ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ► తాజాగా మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా అగ్గిరాజేశారు రాజాసింగ్. ఆయనపై తెలంగాణలోని పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. చదవండి: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాకిచ్చిన బీజేపీ హైకమాండ్.. పది రోజుల్లోగా.. -
‘వారిని కాల్చివేస్తేనే దేశం క్షేమంగా ఉంటుంది’
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోకి అక్రమంగా చొరబడిన రోహింగ్యాలను, బంగ్లాదేశీయులను కాల్చివేస్తేనే దేశం క్షేమంగా ఉంటుందని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జరిగిన ఓ సమావేశంలో రాజాసింగ్ మాట్లాడుతూ.. ‘అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారందరూ మర్యాదగా వెళ్లిపొండి. మీరు వెళ్లకపోతే కాల్చి చంపేయాల్సి వస్తుంది. మిమల్ని చంపేస్తేనే ఈ దేశం ప్రశాంతంగా ఉంటుంది’ అని అన్నారు. అసోంలో నివసిస్తున్న 40 లక్షల మందిని అక్రమ చొరబాటుదారులుగా గుర్తిస్తూ.. ఎన్సీఆర్ (జాతీయ పౌర రిజిస్ట్రర్) జాబితాలో వారి పేర్లను తొలగించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తీవ్ర వివాదం నెలకొన్న నేపథ్యంలో రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అడ్డువచ్చిన వారి తలల నరికేస్తామని గతంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అసోం ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్సీఆర్ జాబితాపై ప్రతిపక్షాల ఆరోపణలను బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాలు పరోక్షంగా అక్రమ వలసదారులకు మద్దతునిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఎన్సీఆర్ చట్టం బీజేపీ తీసుకువచ్చింది కాదని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హయంలోనే దీనిని రూపొందించారని ఆయన గుర్తుచేశారు. ఎన్సీఆర్ను అమలుచేసే ధైర్యం కాంగ్రెస్ పార్టీకి లేక ఇన్ని రోజులు అమలుచేయాలేకపోయారని విమర్శించారు. -
ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్(బీజేపీ) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా పలు రాజకీయ పార్టీలు, నాయకులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. కేవలం ఓట్లు అడుక్కోవడానికే రాజకీయ నాయకులు ఇలాంటి విందులు ఏర్పాటు చేస్తారని... అలాంటి వాటికి తానెప్పుడూ దూరంగా ఉంటానని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడంలో మునిగిపోయిందని.. మిగతా వారి గురించి పట్టించుకునే తీరిక వారికి లేదని విమర్శించారు. అంతేకాకుండా దేశంలో జరుగుతున్న ఉగ్రవాద దాడులకు ‘గ్రీన్‌బుక్’ కారణమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా మతపరమైన భావనలను కించపరిచారనే కారణంగా సెక్షన్ 153-ఎ కింద రాజా సింగ్‌పై కేసు నమోదు చేసినట్లు ఫలక్నామా పోలీసులు తెలిపారు. -
ముఖేష్ గౌడ్‌కు అనుమానమేల?
మాజీ మంత్రి, హైదరాబాద్ నగర రాజకీయాల్లో ఎన్నాళ్లనుంచో ఆరితేరిన యోధుడు ముఖేష్‌గౌడ్‌కు ఈసారి కాంగ్రెస్ టికెట్ దక్కుతుందా లేదా అనే అనుమానం వచ్చినట్లుంది. శుక్రవారం నాడు మంచిరోజని గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన ముఖేష్.. కాంగ్రెస్ అభ్యర్థిగా ఒకటి, స్వతంత్ర అభ్యర్థిగా మరొకటి నామినేషన్లు దాఖలు చేశారు. ఇది అందరినీ అనుమానంలో పడేసింది. వాస్తవానికి ఈసారి ముఖేష్.. తన కుమారుడు వికాస్ గౌడ్‌ను కూడా రాజకీయాల్లోకి దించాలనుకున్నారు. దాంతో ముఖేష్ పార్లమెంటుకు వెళ్లి, తన కుమారుడిని అసెంబ్లీ బరిలో దింపుతారనే కథనాలు కూడా ఇంతకుముందు వచ్చాయి. అయితే ఇటీవలి కాలంలో ఒక కుటుంబానికి ఒకటే పదవి అనే నినాదాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం వెలుగులోకి తెచ్చింది. దాంతో సీనియర్ నాయకుల ఆశలన్నీ అడియాసలుగా మారిపోయాయి. అందుకే ముఖేష్ గౌడ్ నేరుగా అసెంబ్లీకి పోటీ చేయడానికి సిద్ధపడ్డారని సమాచారం. అంతవరకు బాగానే ఉన్నా, ఆయన ఒకవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా, మరోవైపు స్వతంత్ర అభ్యర్థిగా రెండు నామినేషన్లు దాఖలుచేయడంపైనే అనుమానాలు తలెత్తాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు టికెట్ వస్తుందో లేదోనన్న అనుమానం ఏమైనా ముఖేష్‌కు ఉందా అని పలువురు అంటున్నారు. -
పోలీసు అమర వీరులకు నివాళులు
హైదరాబాద్ : పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. గోషామహల్ పోలీస్ స్టేడియంలోని అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, డీజీపీ ప్రసాదరావు, పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ, పలువురు ఉన్నత అధికారులు పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. విధి నిర్వహణలో జాతి కోసం ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగాలను ఈసందర్భంగా స్మరించుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 'పోలీస్ అమరవీరుల'పుస్తకాన్ని ఆవిష్కరించారు. మరోవైపు పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా కర్నూలు జిల్ఆ ఎమ్మిగనూరులో పోలీసులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. విధి నిర్వహణలో అశువులు భాసిన వీరులకు నివాళులు అర్పించారు. ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు.ఇక అనంతపురంలో పోలీసులు కూడా ఎస్పీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. జిల్లా ఎస్పీతో పాటు ఏఎస్సీ, సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్, హోంగార్డులు రక్తదానం చేశారు. -
పోలీసు అమర వీరులకు నివాళులు