Who is BJP MLA Raja Singh And How Many Cases Registered Against Him - Sakshi
Sakshi News home page

Raja Singh: ‘రాజీ’ ఎరుగని బీజేపీ ఎమ్మెల్యే‌.. ఏడికైతే ఆడికైతది.. తగ్గేదెలే!

Published Tue, Aug 23 2022 3:58 PM | Last Updated on Tue, Aug 23 2022 5:43 PM

Who is Raja Singh How many cases Registered Against him - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ ఎమ్మెల్యే ఠాకూర్ రాజాసింగ్ లోథ్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీశాయి. అవసరమైతే ధర్మం కోసం తాను చనిపోయేందుకైనా సిద్ధం కానీ... వెనక్కి తగ్గనని ఆయన తేల్చిచెప్పారు. పోలీసులు ఇప్పటికే రాజాసింగ్‌ను  అరెస్టు చేశారు. బీజేపీ అధిష్ఠానం కూడా ఆయన వ్యాఖ్యలపై సీరియస్ అయింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులు పంపింది.

అయితే రాజాసింగ్‌కు వివాదాలు కొత్తేం కాదు. ఆయనపై ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. గతంలోనూ తీవ్ర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఆ వివరాలు..
రాజాసింగ్  రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైంది. ఆ తర్వాత బీజేపీలో చేరారు. 2014 నుంచి హైదరాబాద్‌లోని గోషామహల్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
2015లో ఓ పెళ్లి వేడుకలో డీజేను ఆపేందుకు వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించి రాజాసింగ్ మొదటిసారి వార్తల్లో నిలిచారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మ్యూజిక్ ప్లే చేస్తే ఆపేందుకు వెళ్లిన పోలీస్‌పై దాడి చేశాడు. దీంతో రాజాసింగ్‌పై కేసు నమోదైంది.
అదే ఏడాది ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని ఓ వర్గం విద్యార్థులు ప్రకటించినప్పుడు రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గోమాతను రక్షించేందుకు ప్రాణలైనా అర్పిస్తాం, అవసరమైతే ప్రాణాలు తీస్తాం అని బెదిరించారు.
2018లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తనపై మొత్తం 43 కేసులు నమోదైనట్లు రాజాసింగ్ పేర్కొన్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం, విద్వేష ప్రసంగాలు, ప్రార్థనా స్థలాన్ని అపవిత్రం చేయడం, హత్యాయత్నం వంటి కేసులు తనపై ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు.
2020లో రాజాసింగ్‌ను ప్రమాదకరమైన వ్యక్తిగా ఫేస్‌బుక్ లేబుల్ చేసింది. ఆ ఏడాది సెప్టెంబర్‌లో విద్వేష ప్రసంగాలు చేసినందుకు ఆయనపై నిషేధం విధించింది. రోహింగ్యా ముస్లింలపై, ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై ఈ చర్యలు తీసుకుంది.
2022 ఏప్రిల్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. భారత్ త్వరలోనే హిందూ దేశంగా మారుతుందని ఆయన పాట కూడా పాడారు.
గతవారం హైదరాబాద్‌లో మునావర్ ఫరుఖీ షో సందర్భంగా రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ షో వేదికను తగలబెడతానని బెదిరించారు. దీంతో ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
తాజాగా మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా అగ్గిరాజేశారు రాజాసింగ్. ఆయనపై తెలంగాణలోని పలుచోట్ల కేసులు నమోదయ్యాయి.
చదవండి: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాకిచ్చిన బీజేపీ హైకమాండ్‌.. పది రోజుల్లోగా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement