
పుత్తూరు: తెలుగుదేశం పార్టీకి చెందిన వెబ్‌సైట్ల ద్వారా ప్రచారం అవుతున్న వివరాలనే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఆదివారం సంచికలో సర్వే పేరుతో ప్రచురించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తేల్చి చెప్పారు. సోమవారం ఆమె చిత్తూరు జిల్లా పుత్తూరులో విలేకరులతో మాట్లాడుతూ.. నగరిలో వైఎస్సార్‌సీపీ గెలుస్తుందని ప్రచురించిన ఆంధ్రజ్యోతి సోమవారం మాత్రం నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజా పరిస్థితి బాగాలేదని ప్రచురించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని తలంటడంతో నగరిలో ఒక్కరోజులో గెలుపు ఓటమిగా మారిపోయిందని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని 19 నియోజకవర్గాల్లో సర్వే చేసి టీడీపీ అధికారంలోకి వస్తుందని ప్రకటించడం హాస్యాస్పందంగా ఉందని, ఇది నీతిమాలిన సర్వే అని స్పష్టం చేశారు. ఆంధ్రజ్యోతి కార్యాలయాలకు ప్రభుత్వ భూములు, ప్రభుత్వ సొమ్ముతో ప్రకటనలు దోచిపెడుతున్నారు కాబట్టే ఆ పత్రికా యాజమాన్యం స్వామి భక్తి చూపిస్తోందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీఎన్ ఏలుమలై, డీసీసీబీ డైరెక్టర్ దిలీప్‌రెడ్డి, రెడ్డివారి భాస్కర్‌రెడ్డి, రవిశేఖర్‌రాజు, ప్రతాప్, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాహీన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment