సచిన్ పైలట్
జైపూర్ : ఈ ఏడాది చివర్లో జరగబోయే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సచిన్ పైలట్ (40) ధీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో (రెండు లోక్‌సభ స్థానాలు, ఒక అసెంబ్లీ స్థానం) కాంగ్రెస్ పార్టీ సంచలన విజయాన్ని నమోదుచేసింది. గత నాలుగు దశాబ్దాలుగా రాజస్థాన్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ మాత్రమే గెలుస్తూ వచ్చింది. కానీ, ఆ చరిత్రను తిరగరాస్తూ తొలిసారి ప్రతిపక్ష కాంగ్రెస్ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో హస్తం శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. విభజన శక్తులకు రాజస్థాన్ ప్రజలు దీటైన సమాధానం ఇచ్చారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యమని పైలట్ అభిప్రాయపడ్డారు. ఇతర పార్టీలతో కూటమిగా ఏర్పడి.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారును సైతం ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
రాజస్థాన్‌లో వసుంధరారాజే సర్కారును, బీజేపీని ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారనడానికి తాజా ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పారు. మూడు విభిన్న ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరిగాయని, జాతీయ రాజధాని ప్రాంతంలో ఉన్న అల్వార్ లోక్‌సభ స్థానంలో, మధ్యరాజస్థాన్‌లో భాగమైన అజ్మీర్ ఎంపీ నియోజకవర్గంలో, దక్షిణ ప్రాంతమైన భిల్వారా అసెంబ్లీ స్థానంలో తాజా ఉప ఎన్నికలు జరిగాయని, మొత్తం 17 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉప ఎన్నికలు జరగగా.. ప్రజలు మూకుమ్మడిగా కాంగ్రెస్‌కు మద్దతు పలికి.. ఘనవిజయాలు అందించారని చెప్పారు. అధికార బీజేపీ డబ్బును విచ్చలవిడిగా వెదజల్లి.. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా తమ విజయాన్ని అడ్డుకోలేకపోయిందని, ఉప ఎన్నికల కోసం మతవాదాన్ని రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నించినా ఆ ఎత్తుగడలు ఫలించలేదని సచిన్ పైలట్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment