సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/కల్వకుర్తి: తెలంగాణ ప్రజ ల పట్ల కేసీఆర్ నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని, నాలుగున్నరేళ్ల పాలనలో ఆయన చేసిన అనైతిక పనులకు సమాధానం చెప్పాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ డిమాండ్ చేశారు. ఆదివారం సంగారెడ్డి జిల్లాలో బీజేపీ సమరభేరి, నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో నవయువ భేరి బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఎవరి ప్రయోజనాల కోసమో కేసీఆర్ వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగాలని అందరూ చర్చిస్తున్న సమయంలో కేసీఆర్ ముందస్తుకు వెళ్లడాన్ని తప్పుబట్టారు.
అసెంబ్లీ, పార్లమెంటుకు వేర్వేరుగా ఎన్నికలు జరగడంతో అభివృద్ధి కుంటుపడటంతో పాటు, ఎన్నికల వ్యయం కూడా పెరుగుతుందన్నారు. ఉద్యమ సమయంలో ప్రజల తో మమేకమైన కేసీఆర్, ముఖ్యమంత్రిగా బాధ్య తలు చేపట్టిన తర్వాత మంత్రులతో పాటు, సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులో ఉండటం లేదని విమర్శించారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవితతో పాటు ఒవైసీ సోదరులకు మాత్రమే ఆయన అందుబాటులో ఉన్నారని దుయ్యబట్టారు. సచివాలయంలో కూర్చుని పాలన సాగించాల్సిన సీఎం ప్రగతి భవన్‌కే పరిమితమయ్యారన్నారు. ఆత్మబలిదానాలతో సాధించిన తెలంగాణ కేసీఆర్ కుర్చీ కోసమా అని ప్రశ్నించారు.
బీజేపీని ఆశీర్వదించండి..
ప్రస్తుతం తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో అధికార మార్పిడిని కోరుకుంటున్నారని, బీజేపీని ఆశీర్వదిస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని సదానందగౌడ పిలుపునిచ్చారు. మోదీకి దేశ ప్రధానిగా అవకాశం ఇస్తే నాలుగున్నరేళ్లలో భారత్‌ను ప్రపంచ పటంలో నిలబెట్టారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సమాఖ్య స్ఫూర్తితో పనిచేయాలన్నదే మోదీ అభిమతమన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు ప్రజలను మోసం చేయడంలో దొందూ దొందేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్య దర్శి మురళీధర్‌రావు విమర్శించారు. ఆ పార్టీలను ప్రజలు నమ్మకూడదని పిలుపునిచ్చారు. సంగారెడ్డిలో జరిగిన సభలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్, నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి అలాగే కల్వకుర్తి సభలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తల్లోజు ఆచారి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేస్తాం..
ఈశాన్య రాష్ట్రాల్లోని త్రిపుర మాదిరిగానే వచ్చే ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని కల్వకుర్తి సభలో సదానందగౌడ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా ప్రధాని మోదీ పరిపాలన కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ముందస్తు ఎన్నికల పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ అభివృద్ధికి అడ్డుకట్ట వేశారని విమర్శించారు. ప్రధాన మంత్రిగా మోదీ బాధ్యతలు స్వీకరించే నాటికి భారతదేశం అవినీతిలో కూరుకుపోయి ప్రపంచ దేశాల్లో తన కీర్తిని కోల్పోయిందన్నారు. నాలుగున్నరేళ్లుగా ఎలాంటి అవినీతి, అక్రమాలు, కుంభకోణాలకు తావు లేకుండా పరిపాలన సాగించి దేశకీర్తి పతాకాలను రెపరెపలాడించారని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment