![Saffron Hoardings](/styles/webp/s3/article_images/2017/10/12/tamil-nadu-anti-dengue-boar.jpg.webp?itok=oTLF7dw0)
చెన్నై: తమిళనాడులో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో చేరేందుకు అన్నాడీఎంకే అడుగులు వేస్తోంది. దీనికి అనుగుణంగా పావులు కదుపుతున్నట్టు స్పష్టంగా కనబడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలే ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. డెంగ్యూ వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తూ పళనిస్వామి సర్కారు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేపట్టింది. ఇందులో భాగంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టింది. అయితే ఈ బ్యానర్లు కాషాయ రంగులో ఉండటం చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు అన్నాడీఎంకే ఏ ప్రచార కార్యక్రమం చేపట్టినా ఆకుపచ్చ రంగులోనే బ్యానర్లు ఉండేవి. దీనికి భిన్నంగా కాషాయ రంగు వినియోగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీకి అన్నాడీఎంకే దగ్గరవుతుందనడానికి ఇది నిదర్శనమని ప్రతిపక్షాలు అంటున్నాయి.
బీజేపీకి అన్నాడీఎంకే లొంగిపోయిందని, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిందని ప్రతిపక్ష డీఎంకే నేత ఎంకే స్టాలిన్ ఆరోపించారు. అయితే తాము వాడింది కాషాయం కాదని ఎరుపు వర్ణమని మంత్రి జయకుమార్ వివరణ ఇచ్చారు. డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు, చూడగానే ఆకట్టుకునేందుకు ఎరుపు రంగులో బ్యానర్లు రూపొందించినట్టు వెల్లడించారు.
ఇదిలావుంటే, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయ అంశాలు ప్రధానితో చర్చించలేదని తెలిపారు. డెంగ్యూ వ్యాధిని నివారించేందుకు అవసరమైన సాయం చేస్తామని, తమిళనాడుకు వైద్య బృందాన్ని పంపుతామని ప్రధాని హామీయిచ్చారని పన్నీర్ సెల్వం వెల్లడించారు. అయితే ఈ పరిణామాలన్ని చూస్తుంటే ఎన్డీఏతో అన్నాడీఎంకే జట్టు కట్టడం ఖాయమని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment