
సాక్షి, చెన్నై: తమిళ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో ఓటమి నేపథ్యంలో అధికార అన్నాడీఎంకే పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరుగురు నాయకులను పార్టీ పదవుల నుంచి తొలగించింది. ఎస్. వెట్రివేల్, తంగ తమిళ సెల్వన్, రంగస్వామి, ముత్తయ్య, వీపీ కళైరాజన్, షోలింగుర్ పార్తీబన్ లను పార్టీ పదవుల నుంచి తప్పిస్తూ అన్నాడీఎంకే ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంది.
ఆర్కే నగర్‌లో శశికళ వర్గం అభ్యర్థి టీటీవీ దినకరన్ ఘన విజయం సాధించడంతో అధికార, విపక్ష పార్టీలు ఉలిక్కిపడ్డాయి. ఆర్కే నగర్‌లో ఊహించనివిధంగా ఓటమి పాలవడంతో అధికార అన్నాడీఎంకే ఉన్నతస్థాయి నాయకులు పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం అత్యవసరంగా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ‘అమ్మ’ కంచుకోటలో పార్టీ పరాజయం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఓటమికి బాధ్యులైన వారిని పార్టీ పదవుల నుంచి తొలగించాలని సమావేశంలో నిర్ణయించారు.
మరోవైపు తన వర్గం ఎమ్మెల్యేలతో ఈ మధ్యాహ్నం దినకరన్ భేటీకానున్నారు. రేపు బెంగళూరు వెళ్లి శశికళను కలిసేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. మూడు నెలల్లో ఈపీఎస్, ఓపీఎస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయమని దినకరన్ నిన్న వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.