ఎమ్మెల్యేలతో దినకరన్ కీలక భేటీ
చెన్నై: తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీలో హైడ్రామా కొనసాగుతోంది. పార్టీ, ప్రభుత్వం నుంచి తనకు ఉద్వాసనకు పలుకుతూ పళనిస్వామి మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నా అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ వెనక్కి తగ్గలేదు. పార్టీపై తన పట్టును నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా బుధవారం ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ మధ్యాహ్నం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.
దినకరన్ ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంత మంది ఎమ్మెల్యేలు హాజరవుతారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆయనకు 20 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సమావేశంలో ఏం చర్చిస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. దినకరన్‌ను, ఆయన కుటుంబాన్ని పార్టీకి, ప్రభుత్వానికి దూరంగా ఉంచాలని పళనిస్వామి మంత్రివర్గం మంగళవారం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.