చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో వర్గ పోరుతో తమిళ రాజకీయాలు వేడెక్కాయి. పార్టీలో ఆధిపత్యం కోసం ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్), ఓ పన్నీర్‌సెల్వం(ఓపీఎస్) పోటీ పడటంతో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ఒక్కరి చేతిలోనే అన్నాడీఎంకే పగ్గాలు ఉండాలని పళనిస్వామి పట్టుబడుతుండగా.. అలాంటిదేమి కుదరదంటూ పన్నీర్‌సెల్వం అడ్డుపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక వెంకటాచలపతి ప్యాలెస్‌లో గురువారం జరిగిన అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ భేటీ రసాభాసగా ముగిసింది.
సమావేశం ముగియడానికి కొద్దిసేపు ముందు పళనిస్వామి వర్గీయులు పన్నీర్‌సెల్వంపైకి వాటర్ బాటిళ్లు విసిరారు. ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తన కారు టైర్లలో గాలి తీసేయడంతో మరో వాహనంలో ఓపీఎస్ వెళ్లిపోయారు. ‘సింగిల్ లీడర్‌షిప్’కు అనుకూలంగా పలువురు సీనియర్ నాయకులు మాట్లాడారు. అయితే కోర్టు తీర్పు కారణంగా దీనిపై ఎటువంటి తీర్మానం చేయలేకపోయారు.
23 తీర్మానాలు తిరస్కరణ
ఓపీఎస్ ఆమోదించిన 23 తీర్మానాలను తిరస్కరిస్తూ అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. 23 తీర్మానాలను జనరల్ కౌన్సిల్ సభ్యులంతా వ్యతిరేకించారని, పార్టీ పగ్గాలు ఒక్కరి చేతిలోనే ఉండాలని వారంతా కోరుకుంటున్నారని అన్నాడీఎంకే డిప్యూటీ సెక్రటరీ మునుస్వామి తెలిపారు. జనరల్ కౌన్సిల్ నిర్ణయాన్ని గౌరవిస్తామని మాజీ మంత్రి జయకుమార్ చెప్పారు. ‘సింగిల్ లీడర్‌షిప్’ తీర్మానాన్ని తర్వాతి సమావేశంలో ఆమోదింపజేసుకుంటామన్నారు.
నాటకీయ పరిణామాలు
అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ జరగకుండా చూడాలని పన్నీర్ సెల్వం.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో వివాదం ముదిరింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఓపీఎస్ మరోసారి కోర్టు తలుపులు తట్టింది. దీనిపై మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం అర్ధరాత్రి వరకు విచారణ చేపట్టింది. ముందుగా ప్రకటించిన 23 తీర్మానాలపై అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకునేందుకు అనుమతి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మిగతా అంశాలపై చర్చపై జరగాలని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ‘సింగిల్ లీడర్‌షిప్’పై తీర్మానాన్ని ఆమోదించడానికి వీలు లేకుండా పోయింది. దీనంతటికీ కారణమైన పన్నీర్ సెల్వంపై పళనిస్వామి మద్దతుదారులు కోపంతో రగిలిపోతున్నారు. (క్లిక్: ప్రజలు చస్తుంటే.. రాజకీయాలు ముఖ్యమా?)
Comments
Please login to add a commentAdd a comment