దినకరన్ సంచలన నిర్ణయం!
చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ కొత్త ప్రతిపాదన చేశారు. అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి వైదొలగేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. శశికళను ప్రధాన కార్యదర్శిగా కొనసాగించాలని కోరినట్టు తెలుస్తోంది. పన్నీర్ సెల్వం వర్గాన్ని తమతో కలుపుకునేందుకు ఆయన అంగీకరించారు. విలీన చర్చలను ఆయన స్వాగతించారు.
బెంగళూరు నుంచి చెన్నైకు వచ్చిన దినకరన్ తో అన్నాడీఎంకే సీనియర్ మంత్రులు సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. పార్టీ ఒక్కటిగా ఉండాలని అందరం కోరుకుంటున్నామని, త్వరలో ఒక తాటిపైకి వస్తామని మంత్రి సెంగొట్టయన్ తెలిపారు.
శశికళ కుటుంబాన్ని పార్టీకి, ప్రభుత్వానికి దూరంగా పెడితే విలీనానికి సిద్ధమని పన్నీర్ సెల్వం షరతు విధించినట్టు ప్రచారం జరుగుతోంది. శశికళ, దినకరన్ లను పార్టీ నుంచి సాగనంపేందుకు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు ఏకమవుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో దినకరన్ దిగివచ్చినట్టు తెలుస్తోంది.