‘ఎప్పటికైనా ఆర్కే నగర్‌లో నాదే విజయం’
చెన్నై: తమిళనాడు ఆర్కే నగర్ ఉప ఎన్నిక విజయంపై అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థి టీటీవీ దినకరన్ ధీమా వ్యక్తం చేశారు. ఆర్కేనగర్ ప్రజలంతా తమ వెంటే ఉన్నారని ఆయన సోమవామిక్కడ అన్నారు. ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా గెలుపు తమనే వరిస్తుందని దినకరన్ జోస్యం చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గీయులు కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాము ఎవరికీ డబ్బులు పంచలేదని దినకరన్ తెలిపారు.
కాగా జయలలిత మరణంతో ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఉప ఎన్నికలో గెలిచి.. ఎలాగైనా పట్టు నిరూపించుకోవాలని అన్నాడీఎంకే శశికళ వర్గం తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి వరకు కూడా ఆర్కే నగర్‌లో అన్నాడీఎంకే నేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఇంతలో ఎన్నికల సంఘం ప్రకటించిన ఉప ఎన్నికను రద్దు చేయడంతో ఆ పార్టీ ఇరకాటంలో పడింది.
అంతేకాకుండా ఉప ఎన్నికను రద్దు చేయడం ద్వారా ఈసీ చరిత్రాత్మక తప్పిదానికి పాల్పడిందంటూ దినకరన్ మండిపడ్డారు. మరోవైపు ఆర్కేనగర్‌లో డబ్బుల పంపిణీపై సీబీఐ విచారణ జరపాలని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, మంత్రుల పాత్రపై కూడా దర్యాపు చేయాలని ఆయన కోరారు.
అత్యంత కీలకంగా మారిన ఈ ఉప ఎన్నిక కోసం రూ. 89 కోట్ల మేరకు ఓటర్లకు శశికళ వర్గం పంచిందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఆదివారం కీలక భేటీ నిర్వహించిన ఎన్నికల సంఘం ఉప ఎన్నికను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానానికి ఈ నెల 12న ఉప ఎన్నిక జరగాల్సి ఉండగా అధికార పార్టీ నేతలు ఇప్పటికే ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బులు పంచారు. ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో ఈ పంపకాల వ్యవహారం గుట్టురట్టైంది.