కార్పొరేటర్‌ నుంచి ఎంపీగా.. సంజయ్‌ ప్రస్థానం | Sakshi Special Interview With Bandi Sanjay | Sakshi
Sakshi News home page

కార్పొరేటర్‌ నుంచి ఎంపీగా.. సంజయ్‌ ప్రస్థానం

Published Wed, Mar 11 2020 5:30 PM | Last Updated on Wed, Mar 11 2020 6:17 PM

Sakshi Special Interview With Bandi Sanjay

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: చిన్ననాటి నుంచి స్వయం సేవక్‌గా అలవాటైన క్రమశిక్షణ... హిందూ ధర్మంపై విశ్వాసం... విద్యార్థి ఉద్యమాల నుంచి అర్బన్‌ బ్యాంకు డైరెక్టర్‌గా, మునిసిపల్‌ కార్పొరేషన్‌ కార్పొరేటర్‌గా అందించిన సేవలు... అవినీతి మకిలి దరికి చేరనీయకపోవడం... 47 సంవత్సరాల ఓ సామాన్యుడు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు కారణమైంది. రెండుసార్లు కరీంనగర్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సంజయ్‌ భారీ మెజారిటీతో ఏకంగా కరీంనగర్‌ ఎంపీగా గెలవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి దక్కడం అదృష్టమంటున్నారు. నిత్యం ప్రజలతో మమేకం కావడం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తన విజయానికి కారణమని ఆయన చెబుతున్నారు. ఉమ్మడి కుటుంబం తన బలమని, విద్యార్థి ఉద్యమాలు, రాజకీయాలతో సినిమాలు, షికార్లకు దూరమయ్యానంటున్న కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌తో ‘సాక్షి’ పర్సనల్‌ టైం... ఆయన మాటల్లోనే...

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: మాది సామాన్య మధ్య తరగతి కుటుంబం. నాన్న బండి నర్సయ్య ప్రభుత్వ టీచర్‌గా ఉండేవారు. కాని ఎక్కువ కాలం డిప్యూటేషన్‌ మీద జిల్లా పరిషత్‌లో విధులు నిర్వహించారు. అమ్మ గృహిణి. మేం నలుగురం సంతానం. ఇద్దరు అన్నలు, ఒక అక్క. ఇంట్లో అందరికన్నా చిన్న వాడిని నేను. కరీంనగర్‌ కాపువాడలో నివసించేవాళ్లం. తరువాత జ్యోతినగర్‌కు షిఫ్ట్‌ అయ్యాం. నాన్న రిటైర్‌ అయిన తరువాత కూడా ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేసేవారు. 25 ఏళ్ల క్రితం ప్రమాదవశాత్తూ ఇంటిపైన ట్యాంక్‌ కూలి నాన్న చనిపోయారు. అందరికీ నాన్న మంచి చదువులు చదివించారు. ముగ్గురు అన్నదమ్ములం ఇప్పటికీ కలిసే ఉంటాం. ఇప్పటికీ ఉమ్మడి కుటుంబం మాది. కొన్నేళ్ల క్రితం మా ఇంట్లో నాపై దాడి జరిగిన తరువాత రాత్రి వేళ నిద్ర పోవడానికి అత్తవారింటికి వెళ్తున్నా.



నా వ్యవహారశైలిని నాన్న అబ్జర్వ్‌ చేసేవారు
నాన్నవి కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ మూలాలే. దాంతో నన్ను అన్ని విధాలా ప్రోత్సహించేవారు. చిన్నప్పుడు ఏబీవీపీ సంఘంలో ఉన్నప్పుడు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి కళాశాల సమస్యలు చెపుతుంటే, నాన్న నన్ను అబ్జర్వ్‌ చేసేవారు. ఏబీవీపీ లీడర్‌గా గొడవల్లో పాల్గొన్నప్పుడు పోలీసులు ఇంటికి వచ్చి నన్ను తీసుకెళ్లినా, అడ్డు చెప్పేవారు కాదు. నన్ను పూర్తిస్థాయిలో ప్రోత్సహించిన ఆయన అనుకోకుండా చనిపోయారు. ఆయన నా ఎదుగుదలను పూర్తిస్థాయిలో చూడకుండానే వెళ్లిపోయారనే బాధ ఇప్పటికీ ఉంది. 

సినిమాలు బాగా చూసేవాణ్ని.. నాన్‌ వెజ్‌ ఇష్టమే
విద్యార్థి దశ నుంచి సినిమాలు బాగా చూసేవాణ్ని. ఏబీవీపీలో ఉన్నా, బీజేపీలో ఉన్నా ఖాళీ దొరికితే ఫ్రెండ్స్‌తో సినిమాలు చూసేవాణ్ని. బాగుందని టాక్‌ వచ్చిన ప్రతి సినిమా చూసేవాణ్ని. ప్రత్యేకంగా అభిమాన హీరోలు అంటూ లేకపోయినా, చిరంజీవి డ్యాన్స్, ఫైట్స్‌ ఇష్టం ఉండేది. గత ఐదారేళ్లుగా సినిమాలకు దూరమయ్యా. ఇక ఫుడ్‌ విషయంలో పెద్దగా పట్టింపులు లేవు. వెజ్, నాన్‌వెజ్‌ రెండూ ఇష్టమే.



23 ఏళ్లకే అర్బన్‌ బ్యాంకు డైరెక్టర్‌ను.. ఇప్పుడు ఎంపీ
1994లో 23 ఏళ్ల వయస్సులోనే కరీంనగర్‌ అర్బన్‌ బ్యాంకు డైరెక్టర్‌గా పోటీ చేసి విజయం సాధించాను. తిరిగి 2000 సంవత్సరంలో మారోసారి బ్యాంకు డైరెక్టర్‌ను. 2005లో కౌన్సిలర్‌గా బీజేపీ నుంచి తొలిసారి గెలిచాను. 2010లో 48వ డివిజన్‌కు మరోసారి కార్పొరేటర్‌గా భారీ మెజారిటీతో గెలిచాను. 2014, 2018లలో కరీంనగర్‌ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కొద్దిపాటి తేడాతో ఓడిపోయాను. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలు అందరికన్నా ఎక్కువ మెజారిటీతో విజయం సాధించాను. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త నుంచి ఢిల్లీ పార్లమెంటులో సభ్యుడిగా ఎన్నికవడం ప్రజలు నామీద ఉంచిన అభిమానమే. 

వెంకయ్య, విద్యాసాగర్‌జీ ద్వారా అద్వానీకి సేవ చేసే భాగ్యం 
1996లో అగ్రనేత ఎల్‌కే అద్వానీ సురాజ్‌ రథయాత్ర దేశంలో సాగింది. అందులో భాగంగా కరీంనగర్‌ యాత్రకు వచ్చినప్పుడు తెల్లవారు జామున చౌరస్తాలో జెండాలు కడుతుంటే అప్పటి మెట్‌పల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్‌ జీ చూసి చలించిపోయారు. మరుసటి రోజు రథయాత్ర సందర్భంగా జరిగిన సభలో అద్వానీకి గంట గంటకు టీ ఇప్పించే పని అప్పగించారు. తరువాత వెంకయ్యనాయుడుకు చెప్పి, నన్ను అద్వానీ రథయాత్ర వాహన శ్రేణికి ఇన్‌చార్జిగా నియమించారు. ఎన్నికల నేపథ్యంలో రథయాత్ర నిలిచిపోవడంతో ఢిల్లీ సెంట్రల్‌ ఆఫీస్‌లో సహాయక్‌గా పంపించారు. సెంట్రల్‌ ఆఫీసులో ఉండి అద్వానీ గారికి, వెంకయ్యనాయుడుకు సేవలు అందించాను. నాకు స్ఫూర్తి ప్రదాతలు విద్యాసాగర్‌ జీ, వెంకయ్యనాయుడు.



చిన్న నాటి నుంచి స్వయక్‌ సేవక్‌నే..
కాపువాడలో ఉన్నప్పుడు నన్ను ఒకటో తరగతిలో సరస్వతి శిశుమందిర్‌లో చేర్పించారు. శిశుమందిర్‌ నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం ఏర్పడింది. నిత్యం శాఖకు వెళ్లేవాడిని. ఆర్‌ఎస్‌ఎస్‌లో ఘటన్‌ నాయక్‌గా, ముఖ్య శిక్షక్‌గా ప్రాథమిక విద్యస్థాయిలోనే పనిచేశా. నాకు విద్యతోపాటు క్రమశిక్షణ సరస్వతి శిశుమందిర్‌ ద్వారా వచ్చింది. నాయకత్వ లక్షణాలు ఆర్‌ఎస్‌ఎస్‌ నేర్పింది. నేనిప్పటికీ స్వయక్‌ సేవక్‌ని అని చెప్పుకోవడానికి గర్వపడతాను.

పొన్నం, గంగుల మా అన్నల్లాంటి వాళ్లు...
ఎమ్మెల్యే కమలాకర్‌ నేను 2005 నుంచి కౌన్సిలర్‌గా కలిసి పనిచేశాం. 2009లో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. 2014, 2018లలో అసెంబ్లీకి ఇద్దరం పోటీ పడ్డాం. దాంతో రాజకీయంగా కొంత గ్యాప్‌. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ నాకన్నా పెద్ద. అయితే రాజకీయంగా జూనియర్‌ కాలేజ్‌ స్థాయి నుంచే మా మధ్య  వైరుధ్యం. ఆయన ఎన్‌ఎస్‌యూఐలో ఉంటే నేను ఏబీవీపీలో ఉండేవాడిని. వ్యక్తిగతంగా మాకేలాంటి ద్వేషాలు లేవు. ఇద్దరు నాకన్న పెద్దవాళ్లు. అన్నల లాగే గౌరవిస్తా. రాజకీయాలు ఎన్నికల వరకే అని నమ్ముతా.



బొట్టు పెట్టుకుంటే ప్రైవేటు స్కూల్‌ నుంచి పంపించారు..
7వ తరగతి వరకు కాపువాడలో ఉన్న మేం తరువాత జ్యోతినగర్‌కు మారాం. శిశుమందిర్‌ దూరం కావడంతో నాన్న నన్ను 8వ తరగతిలో ఓ ప్రైవేటు స్కూల్‌లో చేర్పించారు. ఆ స్కూల్‌కు బొట్టు పెట్టుకుని వెళితే వెనక్కు పంపిస్తామన్నారు. నేను స్కూల్‌ యాజమాన్యంతో గొడవ పడ్డాను. దాంతో ఆ స్కూల్‌ యాజమాన్యం 8వ తరగతి పూర్తి కాగానే నన్ను బయటకు పంపింది. మళ్లీ సరస్వతి శిశుమందిర్‌కే వెళ్లి, 9, 10 తరగతులు చదివాను. ఇంటర్‌ చదివేటప్పుడు ఏబీవీపీలో పూర్తిస్థాయి వర్కర్‌గా పనిచేశాను. డిగ్రీ ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలో, పీజీ తమిళనాడుకు చెందిన ఓ యూనివర్సిటీలో పూర్తి చేశాను.

భార్య అపర్ణది పూర్తి సహకారం
అపర్ణతో మాది పెద్దలు కుదిర్చిన వివాహం. అర్బన్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో 2002లో జరిగింది. ఇద్దరు పిల్లలు. పెద్దబాబు సాయి భగీరథ్‌ ఇంటర్‌ మొదటి సంవత్సరం. చిన్నోడు సాయి సుముఖ్‌ ఐదో తరగతి. అపర్ణ ఎస్‌బీఐలో డిప్యూటీ మేనేజర్‌. నేను బ్యాంకు డైరెక్టర్‌గా, కార్పొరేటర్‌గా, బీజేపీ నాయకుడిగా కుటుంబానికి తగిన సమయం ఇవ్వకపోయినా, అపర్ణ ఉద్యోగం చేస్తూనే కుటుంబాన్ని నడిపించింది. పిల్లలు నాతో కలిసి సినిమాలు, షికార్లకు వెళ్లాలని అనుకున్నా, టైం ఇవ్వలేని స్థితి. మా ఆవిడే అన్నీ చూసుకుంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement