
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేకాభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్) కింద విడుదల చేసే నిధుల విషయంలో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేల మధ్య రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని వైఎస్సార్ సీపీ డోన్ ఎమ్మెల్యే బి.రాజేంద్రనాథ్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఎస్‌డీఎఫ్ నిధుల విడుదల విషయంలో వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీఏడీ కార్యదర్శి, ఆర్థికశాఖ కార్యదర్శి, కర్నూలు జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది.
జూన్ 7వ తేదీ నాటికి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేసి తీరాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేకాభివృద్ధి నిధి, స్టేట్ డెవలప్‌మెంట్ ప్లాన్, స్పెషల్ డెవలప్‌మెంట్ ప్యాకేజీ ఫండ్ కింద ప్రత్యేక అభివృద్ధి పనుల నిమిత్తం ఇచ్చే నిధులను తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నచోట వారికే ఇస్తున్న ప్రభుత్వం, వైఎస్సార్‌సీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న చోట మాత్రం ప్రైవేటు వ్యక్తులకు ఇస్తోందని రాజేంద్రనాథ్‌రెడ్డి తన పిటిషన్‌లో వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment