రేపల్లెలో అవినీతి భూపాలుడు | Satyaprasad is the MLA who has become the whale of corruption By Threatening officers | Sakshi
Sakshi News home page

రేపల్లెలో అవినీతి భూపాలుడు

Published Sat, Apr 6 2019 11:20 AM | Last Updated on Sat, Apr 6 2019 11:20 AM

Satyaprasad is the MLA who has become the whale of corruption By Threatening officers  - Sakshi

సాక్షి, గుంటూరు : రేపల్లె తీరాన అవినీతి తిమింగలంలా మారారు ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మడ అడవులను అడ్డగోలుగా ఆక్రమించేశారు. అధికారులను బెదిరించి రికార్డులు తారుమారు చేసి వందల ఎకరాలను కైవసం చేసుకున్నారు. రేపల్లెలో భూపాలుడి అవతారమెత్తి కోట్ల రూపాయలు దండుకున్నారు. మరో వైపు మత్స్యకారుల నోటికాడ కూడు లాక్కుని కృష్ణానదిలో ఇసుకను తవ్వేశారు.

ప్రజలకు అందాల్సిన ఇసుకను అడ్డదారుల్లో తరలించి అధిక మొత్తానికి అమ్మేసుకున్నారు. ఇలా వందల కోట్ల రూపాయలను పోగేసుకున్నారు.కిడ్నాపర్లు, హంతకులకు కొమ్ముకాస్తూ బాధితుల ఉసురుపోసుకుంటున్నారు. నీరు–చెట్టు పథకం పేరుతో చెరువులను చెరబట్టి మట్టిని మింగేశారు. ఇలా నియోజకవర్గ వ్యాప్తంగా సహజ వనరులను లూటీ చేశారు ఎమ్మెల్యే అనగాని.  

అధికారం దక్కగానే భూ కుంభకోణాలు.. 

పెనుమూడి రేవులో డ్రెడ్జర్లతో అక్రమంగా తవ్వుతున్న ఇసుక 
కనుచూపు మేరలో ఖాళీగా ఉన్న అటవీ భూములపై టీడీపీ నాయకుల కన్ను పడింది. 2014లో అధికారం చేపట్టిన ఐదు నెలల్లో అధికారులను బెదిరించి ఏకంగా 15.13 ఎకరాల అటవీ భూమికి పట్టాలు సృష్టించారు. దీంతోపాటు అదే ప్రాంతంలోని మరో పది ఎకరాల అటవీ భూమిని ఆక్రమించి చెరువులను తవ్వి ఆక్వా సాగుకు సిద్ధం చేశారు. నిజాంపట్నం మండల ఆముదాలపల్లి పంచాయతీ పరిధిలోని చింతరేవులోని అటవీ భూమి 583 సర్వే నంబరులోని 15.13 ఎకరాలను ఎమ్మెల్యే బినామీలు ఆరుగురి పేరున 10–11–2014 తేదీన అప్పటి తహసీల్దారు రవికుమార్‌ పట్టాలు ఇచ్చారు.  

ఇసుక అమ్మకాల్లో రూ. 250 కోట్లు...
అధికార పార్టీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇసుక, మట్టిని దోపిడీ చేసి కోట్ల రూపాయలు గడించాడు. పెనుమూడి రేవులో మ్యాన్యువల్‌గా ఇసుకను తరలించుకునే విధంగా కలెక్టర్‌ మత్స్యకారులకు కల్పించిన అవకాశాలను.. వారికి దక్కకుండా అడ్డుకుని అక్రమ దందాకు తెరతీశారు.

చెరుకుపల్లి, నగరం, నిజాంపట్నం, రేపల్లె, రేపల్లె రూరల్‌ మండలాల్లో నిబంధనలకు విరుద్ధంగా భారీ డ్రెజ్జర్లను వినియోగించిన ఇసుకను తరలించి సుమారు రూ.250 కోట్లు దండుకున్నారు. తమ పొట్టగొడుతున్నారని అనేక సందర్భాళ్లో మత్స్యకారులు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు రేపల్లె, భట్టిప్రోలు మెయిన్‌ డ్రెయిన్ల ఆధునికీకరణలో భాగంగా తవ్విన ఇసుకను సైతం అమ్ముకుని రూ. కోటి రూపాయలు కొట్టేశారు.

విద్యార్థుల భవితవ్యంతో ఆటలు 

పాలిటెక్నిక్‌ కళాశాల  
సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా మోపిదేవి వెంకటరమణారావు ఉన్న హయాంలో తీర ప్రాంత విద్యార్థుల భవితవ్యం కోసం పట్టణంలో 2010లో పాలిటెక్నిక్‌ కళాశాల నెలకొల్పేందుకు కృషి చేశారు. నూతన భవనాల నిర్మాణానికి కావలసిన రూ.4.61 కోట్లు కేటాయించారు. ఈ బాధ్యతను పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌కు అప్పగించారు. అనంతరం ఎన్నికలు రావటంతో పాలకులు మారారు. పాలిటెక్నిక్‌ కళాశాల భవన నిర్మాణ పనులు ప్రారంభానికే నోచుకోలేదు.

ఏ ఏటికాయేడు జాప్యం జరుగుతుండటంతో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. దీంతో కాస్తంత కదిలిన పాలకపక్ష ప్రజాప్రతినిధులు, అధికారులు 2016 జనవరిలో పనులు ప్రారంభించి 2016–17 విద్యా సంవత్సరంలో నూతన భవనాలు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి రెండేళ్లు దాటుతున్నా  భవ నిర్మాణ పనులకు కనీసం శంకుస్థాపన కూడా చేయలేదు.  

బినామీలకు బ్యాంకు రుణాలు..
ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ తన బినామీల పేరుతో రుణాలు పొంది బ్యాంకులను సైతం మోసగించారు. దీనిపై సమగ్ర విచారణకు శ్రీకారం చుట్టిన అధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చారు. అంతే ఆ విచారణ మధ్యలోనే నిలిచిపోయింది.  
అక్రమంగా మత్స్యకార రుణాలు...
ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను చూపుతూ మత్స్యశాఖ ఆధ్వర్యంలో సబ్సిడీ రుణాలు పొందారు. ఇలా సుమారు రూ. 6 కోట్లు తమ ఖాతాల్లో ఎమ్మెల్యే, ఆయన బినామీలు జమ చేసుకున్నారు. దీనిపై విచారణ నిర్వహించిన అధికారులను అధికారంతో కట్టడి చేశారు.  
ఎస్టీ అధికారి బలి...
ప్రభుత్వ భూమిని టీడీపీ నాయకుల సొంత భూమిగా 1బీ అడంగల్‌లో నమోదవడంపై అప్పటి తహసీల్దార్‌ మోహనకృష్ణపై అధికారులు చర్యలు తీసుకున్నారు. రిటైర్డ్‌ అనంతరం తహశీల్దార్‌కు రావల్సిన బెనిఫిట్స్‌ను ఇప్పటికీ ఇవ్వలేదు. గతంలో పని చేసిన కంప్యూటర్‌ ఆపరేటర్‌ ద్వారా బెంగళూరు కేంద్రంగా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ 1బీ అడంగల్‌లో తన బినామీల పేర్లు నమోదు చేయించి అప్పటి తహసీల్దార్‌పై నేరాన్ని మోపారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిటైర్డ్‌ తరువాత బెనిఫిట్స్‌ రాకపోవటంతో ఎస్టీ అధికారిని బలి చేశారని ఆయా వర్గాలు మండిపడుతున్నాయి.   

వసూల్‌ రాజా
ప్రభుత్వంలో ప్రతి పోస్టుకూ భారీ స్థాయిలో సొమ్ము దండుకున్నారు అనగాని. అంగన్‌వాడీ కార్యకర్త పోస్టుకు రూ. 4–రూ.7 లక్షలు, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో కాంట్రాక్ట్‌ ఉద్యోగానికి రూ.7–రూ.10 లక్షలు, ఆయా పోస్టుకు రూ.50 వేల నుంచి రూ.రూ.2 లక్షలు, న్యూట్రీషన్‌ పోస్టులకు రూ.1–రూ.1.50 లక్షల వరకూ స్వయంగా ఎమ్మెల్యే సోదరుడు అనగాని శివప్రసాద్‌ వసూళ్లు చేసినట్లు బహిరంగానే చెబుతున్నారు.

తమ వద్ద సొమ్ము తీసుకుని పోస్టు ఇవ్వలేదంటూ ఇటీవల జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొన్న అనగాని సత్యప్రసాద్‌ను చెరుకుపల్లి మండలం కుంచాలవారిపాలెంలో బాధితులు నిలదీశారు. నిజాంపట్నం మండలం తోటపాలెంలో అంగన్‌వాడీ పోస్టులకు ఎమ్మెల్యే సోదరుడు స్వయంగా వేలం నిర్వహించి అత్యధికంగా రూ.10 లక్షలు వసూలు చేశాడు. దీనిపై టీడీపీ నాయకుల్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. 

జూదాలకు నిలయంగా.. 
రేపల్లె నియోజకవర్గాన్ని జూదాలకు నిలయంగా మార్చిన ఘనత అనగాని సత్యప్రసాద్‌కు దక్కుతుంది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే కుటుంబాలతో ఆనందంగా గడిపే సంస్కృతి నుంచి జూదాలకు పరుగుతీసే విధంగా మార్చారు. ఇలా ఎన్నో కుటుంబాల ఉసురుపోకున్నారని మహిళలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. దీంతోపాటు నియోజకవర్గంలో పేకాట, బెట్టింగ్‌లను ప్రోత్సహిస్తూ ఆయన సోదరుడు నెలవారీ మామూళ్ల వసూలు చేస్తున్నారు.

నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ కనుసన్నల్లో ఏటా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సంప్రదాయ ముసుగులో కోడి పందేలు, పేకాటలను భారీగా నిర్వహిస్తున్నారు. చెరుకుపల్లి మండలంలోని తూర్పుపాలెంలో 2018లో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ఆధ్వర్యంలో కోడి పందేల బరిని ఏర్పాటు చేశారు. మూడురోజుల పాటు జాదాల నిర్వహణకు సుమారు రూ. 50 కోట్ల వరకు దండుకున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement