విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు
శ్రీకాళహస్తి : టీడీపీ శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని... ఆయన దబాయింపులకు ఎవరూ భయపడరని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు అన్నారు. చిన్నవాడు భవిష్యత్ ఉన్నవాడు పెద్దలను గౌరవించడం... మర్యాదగా మాట్లాడం నేర్చుకోవాలని సూచించారు. మంగళవారం ఎస్సీవీ నాయుడు ఆయన నివాస గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ మీ ఆరోపణలు స్వీకరిస్తున్నా.. ఎవరి వద్ద కమీషన్లు తీసుకున్నానో నిరూపించు, బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా ఎప్పుడు.. ఎక్కడ కూర్చుని మాట్లాడుకుందామో... చెప్పండి అంటూ సవాల్ విసిరారు.
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఆయన తండ్రి బొజ్జల గంగసుబ్బరామిరెడ్డిని శ్రీకాళహస్తిలోకి రానీయకుండా అడ్డగిస్తే వారికి అండగా నిలిచి సహాయ సహకారాలు అందించింది తామేనని చెప్పారు. బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చెల్లవని, నీచ రాజకీయాలు శ్రీకాళహస్తిలో చేయలేరని తెలిపారు. ‘పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లం మేము.. సొమ్ములు చేసుకుంది సంపాదించింది మీరే...’ అంటూ ధ్వజమెత్తారు. ‘మీరేమైనా రాజుల కుటుంబంలోంచి వచ్చారా... మీ తాత ఓ కాంట్రాక్టర్... అది తెలుసుకో, మేము నీ కింద పనిచేసే గుమస్తాలం కాదు, నీ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు’ అని తెలిపారు.
‘తప్పులు ఉంటే సరిదిద్దుకో, మేము సరిదిద్దుకుంటాం ...బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడివి అనే అర్హత తప్ప నీకు ఏమీ లేదు..’ అని విమర్శించారు. ఎవరి సత్తా ఏమిటో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు. వైఎస్సార్‌సీపీ తొట్టంబేడు మండల కన్వీనర్ ఉన్నం వాసుదేవనాయుడు మాట్లాడుతూ ఉపాధి పనులు తాను చేయలేదని, తాను కమీషన్లు ఇచ్చినట్లు తనపై ఆరోపణలు చేయడం తగదని చెప్పారు. ఏర్పేడు మాజీ ఎంపీపీ ప్రకాష్ యాదవ్, నాయకులు గురుదశరథన్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ మ్యాగీక్లారా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment