
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అంటేనే అవినీతి అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కర్ణాటక అసెంబ్లీలో మెజారిటీ సాధనకు మోదీ అవినీతిని ప్రోత్సహించారని ఆయన మండిపడ్డారు. కర్ణాటక ఉదంతంతో బీజేపీ, ఆరెస్సెస్‌లు గుణపాఠం నేర్చుకుంటాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, ఆరెస్సెస్‌లకు దేశంలోని వ్యవస్థలపై ఎలాంటి గౌరవం లేదని మండిపడ్డారు. శనివారం నాడిక్కడ రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌తో పాటు జేడీఎస్ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో, ఆయన ప్రోద్బలంతో నడిచిన వ్యవహారాన్ని కర్ణాటక ప్రజలు చూశారు. అవినీతికి వ్యతిరేకంగా మోదీ చేసే ప్రసంగాలు పూర్తి అబద్ధం. అసలు మోదీ అంటేనే అవినీతి. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడే మోదీ కర్ణాటకలో ఎమ్మెల్యేల కొనుగోలును, అవినీతిని ప్రోత్సహించారు. ఆయన దేశాన్ని నాశనం చేస్తున్నారు.
కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ నేతలు ఫోన్‌లో చేసిన బేరసారాలు ప్రస్తుతం బహిర్గతమయ్యాయి’ అని తెలిపారు. దేశం, వ్యవస్థలు, సుప్రీంకోర్టు కంటే ప్రధాని ఎక్కువేం కాదని వ్యాఖ్యానించారు. కర్ణాటక గవర్నర్ వజూభాయ్ రాజీనామా సమర్పించాలనడం మంచి ఆలోచనే అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రతిపక్షాలన్ని ఏకమై బీజేపీని ఓడించడం గర్వంగా ఉందనీ, ఇకపై దేశవ్యాప్తంగా దీన్నే పునరావృతం చేస్తామని రాహుల్ పేర్కొన్నారు. ‘యడ్యూరప్ప రాజీనామా అనంతరం జాతీయ గీతం ఆలపించకుండానే బీజేపీ ఎమ్మెల్యేలు, ప్రోటెం స్పీకర్ సభనుంచి నిష్క్రమించారు. దేశంలోని వ్యవస్థలపై వాళ్లకు ఏమాత్రం గౌరవం లేదని దీన్నిబట్టే అర్థమవుతోంది. దేశంలో ప్రతి వ్యవస్థను నాశనం చేస్తున్న ఇలాంటి శక్తులతోనే ప్రస్తుతం మనం పోరాడుతున్నాం’ అని వ్యాఖ్యానించారు. దేశంలోని వ్యవస్థలను, ప్రజా తీర్పును ఎవ్వరూ అగౌరవపర్చలేరని కర్ణాటక ఉదంతంతో బీజేపీ, ఆరెస్సెస్‌లు తెలుసుకున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment