
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ రేపు (గురువారం) జరుగనుంది. రెండో విడత ఎన్నికల ప్రచారం మంగళవారంతో పరిసమాప్తమైంది. ఒడిశాలో 35 అసెంబ్లీ స్థానాలకు కూడా గురువారం రెండో దశ పోలింగ్ జరుగనుంది. కర్ణాటకలో 28, తమిళనాడులో 39 లోక్ సభ స్థానాలకు ఈ దశలోనే పోలింగ్ జరుగనుంది. అస్సాం, బిహార్, ఛత్తీస్ గఢ్, జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, మణిపూర్, త్రిపుర, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలోని 96 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ కొనసాగనుంది. రేపు జరిగే ఎన్నికల్లో కేంద్రమంత్రులు, పలువురు ప్రముఖ నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మొత్తం 15 కోట్లకు పైగా ఓటర్లు 1629 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. తొలి విడతలో భాగంగా 20 రాష్ట్రాల్లోని 91 లోక్‌సభ స్థానాలకు ఈనెల 11న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.
మథుర: ప్రతిష్టాత్మకమైన ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రముఖ నటి, హేమామాలిని పోటీచేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మహేష్ పథాక్, ఆర్‌ఎల్డీ నుంచి నరేంద్ర సింగ్ కున్వర్ పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఆర్‌ఎల్డీ అభ్యర్థి జయంత్ చౌదరీ విజయంపై హేమామాలిని సాధించారు.
ఫతేపూర్‌సిక్రీ: కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ యూపీ అధ్యక్షుడు రాజ్ బబ్బర్ పోటీలో నిలవగా, బీజేపీ నుంచి రాజ్ కుమార్ పోటీలో నిలిచారు.
కన్యాకుమారి: (తమిళనాడు) దక్షిణ భారతంలో ప్రసిద్ధిగాంచిన కన్యాకుమారి లోక్‌సభ పోరు ఉత్కంఠ రేపుతోంది. పొత్తులో భాగంగా ఈస్థానాన్ని డీఎంకే కాంగ్రెస్‌కు కేటాయించగా, పోన్ రాధాకృష్ణ బీజేపీ అభ్యర్థిగా పోటీపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి వసంతకుమార్ బరిలో నిలిచారు.
తుత్తుకుడి: తమిళనాడులో ఈ లోక్‌సభ స్థానం చర్చనీయాంశంగా మారింది. డీఎంకే నుంచి మాజీ సీఎం కరుణానిధి కుమార్తె కనిమొళి బరిలో నిలవగా.. బీజేపీ నుంచి ఫైర్‌బ్రాండ్ సౌందరరాజన్ పోటీలో ఉన్నారు. డీఎంకే ఆస్థానాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
శివగంగా( తమిళనాడు): కేంద్ర మాజీమంత్రి చిదంబరం తనయుడు, కార్తీ చిదంబరాన్ని కాంగ్రెస్ బరిలో నిలిపింది. హెచ్ రాజా బీజేపీ నుంచి పోటీపడుతున్నారు.
లోకనాయకుడికీ అగ్నిపరీక్షే..
బహుభాషా నటునిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హీరో కమల్ హాసన్. ఆయన నెలకొల్పిన మక్కళ్ నీధి మయ్యం పార్టీ తొలిసారిగా లోక్ సభ ఎన్నికలను రుచి చూస్తోంది. ఈ ఎన్నికల్లో కమల్ హాసన్ పోటీ చేయట్లేదు. అయినప్పటికీ.. తమిళనాడులోని 39 లోక్ సభ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించారు. రెండో దశలో తమిళనాడులోని అన్ని నియోజకవర్గాలకూ పోలింగ్ జరుగనుంది. కమల్ హాసన్ ప్రభావం ఏ విధంగా ఉంటుందనే విషయం కూడా తేలనుంది. రాష్ట్ర రాజకీయాలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించినందున తాను లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని కమల్ ఇదివరకే ప్రకటించారు.
తుమకూరు, (కర్ణాటక): మాజీ ప్రధాని దేవెగౌడ ఆస్థానం నుంచి పోటీ చేస్తుడడంతో యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. చివరి వరకు ఆయన పోటీకి నిరాకరించడంతో కాంగ్రెస్ ఇక్కడ అభ్యర్థిని సైతం ప్రకటించింది. తీవ్ర ఉత్కంఠ నడుమ తూమకూరు నుంచి పోటీ చేస్తున్నట్లు దేవెగౌడ ప్రకటించి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. జీఎస్ దస్వరాజ్ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. అలాగే జేడీఎస్‌కు కంచుకోటైన మాండ్య నుంచి సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ తొలిసారి పోటీ పడుతున్నారు. గతంలో ఇక్కడి నుంచి గెలిచిన ప్రముఖ నటుడు అంభారిష్ మృతిలో ఆయన భార్య సుమలత స్వాతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.
మాండ్య నుంచి నటి సుమలత, బెంగళూరు సెంట్రల్ నుంచి సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ ఒకేసారి రాజకీయాల్లోకి ప్రవేశించడం చెప్పుకోదగ్గ విశేషం. ఈ విషయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే- వారిద్దరూ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగారు. సుమలతకు బీజేపీ మద్దతు ఇస్తుండగా.. ప్రకాష్ రాజ్ కు ఆమ్ఆద్మీ పార్టీ అండగా నిలిచింది. ఈ రెండు స్థానాల్లో అటు బీజేపీ, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ తమ అభ్యర్థులను నిలబెట్టలేదు. దీనితోపాటు నిఖిల్ గౌడ కూడా నటుడే కావడంతో.. కర్ణాటక రాజకీయాలు సినీ గ్లామర్ ను సంతరించుకున్నాయి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, ఎన్సీ అధినేత ఫరూర్ అబ్దుల్లా శ్రీనగర్ లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలిచారు. పీడీపీ, బీజేపీ కూడా అభ్యర్థులను ప్రకటించాయి. వీటితో పాటు బెంగుళూర్ దక్షిణ, డార్జిలింగ్, రాణిగంజ్, మహారాష్ట్రలోని అమరావతి, అకోలా స్థానాలకు రేపు పోలింగ్ జరుగనుంది. అలాగే ఇప్పటికే వరుసగా ముడు సార్లు విజయాన్ని అందుకున్న బీజూ జనతాదళ్ నాలుగోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. 145 అసెంబ్లీ స్థానాలున్న ఒడిశాలో రెండో విడతలో 35 స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment