
ముంబై : మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ధీమాగా ఉన్న శివసేనకు బుధవారం ఆ పార్టీ ఎమ్మెల్యేలు గట్టి షాక్ ఇచ్చారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ 17 మంది ఎమ్మెల్యేలు గళమెత్తారు. అసమ్మతి ఎమ్మెల్యేలు పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ కానున్నారు. మరోవైపు శివసేన సారథ్యంలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకోగా రైతుల సమస్యలపైనే తాను ప్రధానిని కలిశానని పవార్ వెల్లడించారు. మహారాష్ట్ర రాజకీయాలు తమ భేటీలో ప్రస్తావనకు రాలేదని తెలిపారు. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మధ్య సంప్రదింపులు కొలిక్కిరాని క్రమంలో సొంత పార్టీలోనే అసమ్మతి స్వరాలు వినిపిస్తుండటం శివసేనకు ఇబ్బందికరంగా మారింది. ఇక బీజేపీ సైతం శివసేన అసంతృప్త ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్లతో పాటు తమతో కలిసివచ్చే ఇతర పార్టీల్లోని ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతూ ప్రభుత్వ ఏర్పాటుకు తమ ముందున్న అవకాశాలపై ఆరా తీస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment