సాక్షి, హైదరాబాద్: ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఎలా సాధ్యమో వివరించాలని ప్రభుత్వాన్ని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. గురువారం శాసనమండలిలో అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమంపై లఘు చర్చ జరిగింది. ముఖ్యమంత్రి పంపిన 9 పేజీల సమాచారాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సభకు చదివి వినిపించారు. తెలంగాణ ఏర్పాటవక ముందు పదేళ్లపాటు పాలించిన కాంగ్రెస్.. తన హాయాంలో ముస్లింల కోసం రూ.932 కోట్లే ఖర్చు పెట్టిందని, కానీ మూడున్నరేళ్లలో రూ.2,146 కోట్లను మైనార్టీల సంక్షేమానికి టీఆర్‌ఎస్ సర్కారు ఖర్చు చేసిందని వివరించారు.
ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. 2001 నుంచి ముస్లిం రిజర్వేషన్ల కోసం తాను చేసిన కసరత్తును వివరించారు. వైఎస్సార్ సీఎం అయ్యాక 56 రోజుల్లోనే 5% రిజర్వేషన్లు కల్పించారని, కానీ మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దన్న సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా 4% అమలు చేశారని గుర్తు చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ.. మతపర రిజర్వేషన్లకు తాము పూర్తి వ్యతిరేకమన్నారు.
సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సమాధానమిస్తూ.. మైనార్టీ రిజర్వేషన్ల అంశం మన రాష్ట్రానికి సంబంధించిన సమస్యే కాదని, దేశవ్యాప్తంగా ఉందని, తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్‌లో చేర్చి రిజర్వేషన్లు అమలు చేయడమే పరిష్కార మార్గమని వివరించారు.
నమ్మించబోయి..
ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించిన ఘనత దివంగత సీఎం వైఎస్సార్‌ది కాదని.. కేసీఆర్, సోనియాగాంధీలదని చెప్పేందుకు నానా తంటాలు పడిన ఫరూఖ్ హుస్సేన్, చివరకు సభలో నవ్వులపాలయ్యారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ముస్లింల రిజర్వేషన్ల కోసం సోనియాపై ఒత్తిడి తెచ్చారని, దీంతో ముస్లిం రిజర్వేషన్ల అధ్యయనం కోసం సచార్ కమిటీని సోనియా నియమించారని వివరించారు.
కేసీఆర్ సూచనలతో కమిటీ హైదరాబాద్‌కు వచ్చిందని, తానే 4 రోజులు వారి వెంట ఉండి పరిస్థితి వివరించినట్లు పేర్కొన్నారు. సచార్ కమిటీ నివేదిక మేరకు అప్పటి సీఎం వైఎస్సార్‌పై సోనియా ఒత్తిడి చేసి 4% రిజర్వేషన్లు ఇప్పించారని వివరించే ప్రయత్నం చేశారు. ఫరూఖ్ వివరణపై జోక్యం చేసుకున్న షబ్బీర్.. వైఎస్సార్ 2004లో మైనార్టీలకు 4% రిజర్వేషన్లు కల్పించారని, 2005లో సచార్ కమిటీని ఏర్పాటు చేశారని చెప్పటంతో సభ్యులు ఘొల్లుమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment