న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నతరుణంలో రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన పార్టీలు తమదైన శైలీలో ప్రచారాల హోరును కొనసాగిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. షాహిన్ బాగ్ నిరసనలు ఎన్నికల్లో ప్రధాన అంశాలు కాబోవని, అభివృద్దిపైనే ప్రజలు తీర్పు ఇస్తారని అన్నారు. బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తే టీవీ షోలో చర్చించడానికి తాను సిద్దమని సవాలు విసిరారు. తాము చేసిన అభివృద్ధిని వివరించి ప్రజలను ఓట్లు అడుగుతామని అన్నారు. ప్రజలు తమను మరోసారి గెలిపిస్తారంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని షాహిన్‌బాగ్ ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వారిపై కేజ్రీవాల్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని బీజేపీ ఆరోపిస్తుండగా.. బీజేపీ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తుందని కేజ్రీవాల్ అన్నారు.
సీఏఏ, ఏన్‌ఆర్‌సీపై మీ వైఖరేంటని ప్రశ్నించగా.. ఎన్నికల్లో ప్రజలు విద్యుత్, నీరు, విద్య, పాఠశాలలు, ఆసుపత్రుల అభివృద్ధి తదితర అంశాలకు ప్రాధాన్యతనిస్తారని చెప్పారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ ఈ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపవని అన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు రాష్ట్రంలో నివసిస్తున్నారని, అందుకే ఢిల్లీ మినీ ఇండియాగా పేరు గాంచిందని తెలిపారు. విద్వేష రాజకీయాలను ఢిల్లీ ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా తమ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో పాఠశాలలు, ఆస్పత్రుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. ఆప్ ప్రభుత్వం రాకముందు 2,300ప్రాంతాలలో నీటి సమస్యలు ఉండేవని, తమ ప్రభుత్వం అన్ని ప్రాంతాలలో సమస్యలు తీర్చిందన్నారు. ప్రస్తుతం 125ప్రాంతాలలో మాత్రమే సమస్యలు ఉన్నావని తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం అనేక నివారణ చర్యలను చేపట్టిందన్నారు. తాను అవకాశవాద రాజకీయాలకు పాల్పడనని, ఢిల్లీని ప్రపంచంలోనే నెంబర్ వన్ నగరంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment