కాంగ్రెస్ ఎంపీ, యునైటైడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) తిరువనంతపురం ఎంపీ అభ్యర్థి శశి థరూర్ గాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన స్థానిక దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన తులాభారం కార్యక్రమంలో అపశృతి దొర్లింది. తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం శశి థరూర్ పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.
హిందూ పర్వదినాల్లో తమ బరువుకు సరితూగే ధన, వస్తు రూపేణా దేవుడికిచ్చే కానుకే తులాభారం. విషు డే ( కేరళ ఉగాది) సందర్భంగా శశి థరూర్ అరటిపళ్లతో తులాభారం ఇచ్చారు. కేరళ, తిరువనంతపురంలోని గాంధారి అమ్మాన్ దేవాలయంలో ఈ తులాభార నిర్వహిస్తుండగా పట్టుదప్పి ఆయన కిందపడిపోయారు. దీంతో ఆయన తలకు, కాలికి తీవ్ర గాయాలయ్యాయని స్థానిక నాయకుడు తాంపనూర్ రవి మీడియాకు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. ఆయన తలపై 10 కుట్లు పడ్డాయన్నాయనీ, అయితే మెరుగైన చికిత్స కోసం శశి థరూర్‌ను తిరువనంతపురం మెడికల్ కాలేజీకి తరలించినట్టు చెప్పారు.
కాగా తన తల్లి, చెల్లెళ్లిద్దరూ తనకోసం ప్రచారం నిర్వహిస్తున్నారంటూ రెండు రోజుల క్రితం శశి థరూర్ ఒక ఫోటోను ట్విటర్‌లో షేర్ చేశారు. శక్తివంతమైన ముగ్గురు నాయర్ ధీర మహిళలంటూ ట్వీట్ చేయడం విమర్శలకు తావిచ్చింది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో తిరువనంతపురంనుంచి పోటీ చేస్తున్న శశిథరూర్ గట్టి పోటీ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment