
మమతా బెనర్జీ, అరుణ్ శౌరీలతో బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి ఎంపీ శత్రుఘ్న సిన్హా షాకివ్వనున్నారా? ఈ మేరకు ఆయన బుధవారం స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. బీజేపీ తనకు తగిన గౌరవం ఇవ్వడం లేదని, 2019 ఎన్నికల్లో వేరే పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సిన్హా అన్నారు. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి బీజేపీ తనను చిన్నచూపు చూస్తోందని వ్యాఖ్యానించారు.
అయితే, ఏ పార్టీ నుంచి టికెట్ తీసుకున్నా పాట్నా పార్లమెంటు నియోజవర్గం నుంచే పోటీ చేస్తానని వెల్లడించారు. ఇప్పటికే పలు పార్టీలు తనకు టికెట్ ఆఫర్ చేశాయని చెప్పారు. 2014లో బీజేపీ తనకు టికెట్ ఇవ్వబోవడం లేదనే పుకార్లు వచ్చాయని అన్నారు. ప్రస్తుతం మళ్లీ అవే పుకార్లు షికార్లు చేస్తున్నాయని చెప్పారు.
పార్టీని భుజస్కంధాలపై వేసుకుని రెండు నుంచి 200 సీట్లకు తీసుకొచ్చిన ఎల్‌కే అద్వాణీ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో అందరికీ తెలుసని అన్నారు. పార్టీలోని కొందరు వ్యక్తులు ఇతరులను చిన్నచూపు చూస్తున్నారని చెప్పారు.