ముంబై : తమ పార్టీ సభ్యుడే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నాడని శివసేన పార్టీ పేర్కొంది. బీజేపీ మిత్రపక్షంగా ఉన్నప్పటికీ తమ రాజకీయ స్వాత్రంత్ర్యాన్ని ఎప్పటికీ కోల్పోమని స్పష్టం చేసింది. హిందుత్వ, మరాఠీల అస్థిత్వాన్ని కాపాడటమే శివసేన ధ్యేయమని పేర్కొంది. శివసేన పార్టీ 53వ ఆవిర్భావ దినోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ క్రమంలో వచ్చే ఏడాది నాటికి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తమ పార్టీ సభ్యుడు సీఎం హోదాలో హాజరవుతారని వెల్లడించింది. ఈ మేరకు శివసేన తన అధికార పత్రిక సామ్నాలో కథనం ప్రచురించింది.
బుధవారం నాటి కార్యక్రమానికి శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సహా పార్టీ శ్రేణులు భారీ ఎత్తున హాజరయ్యాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్ధవ్ ఠాక్రేను తన పెద్దన్నగా అభివర్ణించారు. అదే విధంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనతో కలిసి ఏకపక్ష విజయాన్ని అందుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల పదవి గురించి ప్రస్తుతానికి తాము ఆలోచించడం లేదని.. కేవలం గెలుపుపైనే దృష్టి సారించామని పేర్కొన్నారు.
ఇక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే సీట్ల గురించి శివసేన-బీజేపీ వర్గాలు ఒక అవగాహనకు వచ్చాయి. అయితే ఇరు పార్టీలు ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్నాయి. ఈ క్రమంలో చెరో రెండున్నరేళ్లు ప్రభుత్వాధినేతగా ఉండే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో శివసేన..యూత్ వింగ్ యువసేన కార్యదర్శి వరుణ్ సర్దేశాయి చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. బీజేపీతో అధికారం పంచుకోనున్న తమకు రెండున్నరేళ్ల పాటు సీఎంగా ఉండే అవకాశం కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చినట్లు ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా రాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ ముంగటివార్ మాత్రం తమ పార్టీ అభ్యర్థే సీఎం అవుతారని కుండబద్ధలు కొట్టారు. ఈ నేపథ్యంలో సామ్నా ఈ కథనం ప్రచురించడం గమనార్హం.
చదవండి : మహారాష్ట్ర సీఎంగా ఆదిత్య ఠాక్రే!!
Comments
Please login to add a commentAdd a comment