
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ వేగం పెంచింది. ఈ నెల 10న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం.. వచ్చే నెల 14న పోలింగ్ జరగనుండడంతో ఆ పార్టీ అధిష్టానం సాధ్యమైనంత త్వరలో అభ్యర్థులను ప్రకటించాలనే యోచనతో ఉంది. ఈ మేరకు టీపీసీసీ నుంచి ఇప్పటికే అందిన ఎంపీ ఆశావహుల జాబితాపై కసరత్తు చేస్తోన్న ఆలిండియా కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మంగళవారం రాత్రి ఢిల్లీలో భేటీ అయింది. వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించింది. పార్టీలో ఆశావహుల నడవడిక, వారి పనితీరు ఇతరాత్ర వివరాలను పరిగణలోకి తీసుకుని స్క్రూట్నీ పూర్తి చేసింది. ఒక్కో పార్లమెంట్ స్థానం నుంచి ఇద్దరు, ముగ్గురు చొప్పున పేర్లు ఖరారు చేసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) చేతికి అందజేసింది.
ఈ నెల 16న భేటీ కానున్న సీఈసీ ..
ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేసిన జాబితాపై కసరత్తు చేసి అదేరోజు ఎంపీ అభ్యర్థులను ప్రకటించనుంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆశావహుల్లో ఉత్కంఠ పెరిగింది. పార్టీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందోననే చర్చ ఉమ్మడి పాలమూరు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఇప్పటికే మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డితో పాటు పలువురు ఆశావహులు హస్తినాకు చేరుకున్నారు.
అసెంబ్లీ ఫలితాల్లో కోలుకోలేని దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి తెలంగాణలోని 17స్థానాల్లోనూ పాగా వే సేందుకు వ్యూహాలు రచిస్తోంది. అయితే అధికార టీఆర్‌ఎస్ కంటే ముందే లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించాలని అధిష్టానం నిర్ణయించినా.. స్థానిక సమస్యలు, డిమాండ్లను పరిగణలోకి తీసుకున్న డీసీసీ, టీపీసీసీ వచ్చిన దరఖాస్తులను వడబోసేందుకు జాప్యమైంది. గతనెల 11 నుంచి 16వ తేదీ వరకు ఆశావహుల నుంచి దరఖాస్తులను డీసీసీ స్వీకరించింది. ఈ క్రమంలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధి నుంచి పదకొండు దరఖాస్తులు రాగా ఆరుగురిని, నాగర్‌కర్నూల్ నుంచి 36 దరఖాస్తులు రాగా ఐదుగురిని ఎంపిక చేసింది.
గందరగోళం సృష్టించిన ఆ ‘లేఖ’..
అసెంబ్లీ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇదే క్రమంలో టీపీసీసీ నుంచి ఏఐసీసీకి ఆశావహుల జాబితా వెళ్లిన తర్వాత పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు ఏఐసీసీకి లేఖ రాశారని.. అందులో మహబూబ్‌నగర్ నుంచి మాజీ మంత్రి డీకే అరుణ, నాగర్‌కర్నూల్ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పేర్లు ఉన్నాయనే ప్రచారం జరుగుతుండడంతో ఉమ్మడి జిల్లాలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే.. పార్టీ అధిష్టానం మాత్రం టీపీసీసీ, డీసీసీ నుంచి వచ్చిన దరఖాస్తులనే ప్రామాణికంగా చేసుకుని ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తారని జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు తెలిపారు. కాగా, మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్ధిగా వంశీచందర్ వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నాగర్‌కర్నూల్ నుంచి స్థానికుడికే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుండడంతో ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ నంది ఎల్లయ్యకు ఈ సారి టికెట్ దక్కకపోవచ్చని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఆయన స్థానంలో అలంపూర్ మాజీ ఎ మ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవిలలో ఒకరి పేరు ఖరారు అవుతుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment