వాట్సాప్‌ ఎలక్షన్స్‌ | Social Media War And Political Campaign in Whatsapp Twitter | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ ఎలక్షన్స్‌

Published Fri, Mar 15 2019 10:46 AM | Last Updated on Fri, Mar 15 2019 10:46 AM

Social Media War And Political Campaign in Whatsapp Twitter - Sakshi

యుద్ధం మొదలైంది. దేశం దశ దిశ మార్చే ఎన్నికల సమరానికి రాజకీయ పార్టీలన్నీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. ఈసారి వాట్సాప్‌ వేదికగా రాజకీయ పార్టీలు ప్రచార భేరి మోగించాయి. అందుకే 2019 ఎన్నికల్ని వాట్సాప్‌ ఎన్నికలని అంటున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లకి మించి వాట్సాప్‌ మన దేశంలో చొచ్చుకుపోయింది. దానికి తోడు ఫేక్‌ న్యూస్‌ బురద వరదలా పొంగిపొరలుతోంది. దీని ప్రభావం ఓటర్లపై ఎలా ఉంటుందన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. భారత్‌లో వాట్సాప్‌ 2010లో వినియోగంలోకి వచ్చింది. కానీ స్వల్ప వ్యవధిలోనే దాని వాడకం దారుల సంఖ్య బాగా పెరిగిపోయింది.

దాదాపుగా 20 కోట్ల మంది వాట్సాప్‌ను వాడుతున్నట్టు అంచనా. దీంతో రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి వాట్సాప్‌నే ఎంచుకుంటున్నాయి. అధికార బీజేపీ ఇప్పటికే 9 లక్షల మంది వలంటీర్లను ‘సెల్‌ఫోన్‌ ప్రముఖ్‌’ పేరుతో రంగంలోకి దింపింది. వాట్సాప్‌లో వివిధ గ్రూపులు ఏర్పాటు చేసి ప్రధానమంత్రి మోదీ సాధించిన విజయాలు, ప్రభుత్వ పథకాలను ప్రచా రం చేయడమే వీళ్ల పని. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ డిజిటల్‌ సతి పేరుతో యాప్‌ రూపొందించింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో వాట్సాప్‌లో ఎలాంటి ప్రచారం జరుగుతోందో ఒక కన్నేసి ఉంచింది. గత ఏడాది బ్రెజిల్‌లో జరిగిన ఎన్నికల్లో వాట్సాప్‌ను అన్ని రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారానికే వినియోగించుకున్నాయి. ఇప్పుడు భారత్‌లో కూడా అదే జరుగుతుందన్న ఆందోళనలైతే ఉన్నాయి. 

రియల్‌ – వైరల్‌?.. అదే సవాల్‌
ఈసారి ఎన్నికల్లో పుల్వామా ఘటన, తదనంతర భారత్, పాక్‌ మధ్య ఘర్షణలే అత్యధిక ప్రభావం చూపిస్తాయని అంచనాలు ఉన్నాయి. ఆ సమయంలో వాట్సాప్‌లో వైరల్‌గా మారిన వాటిల్లో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ జనం వాటినే ఆసక్తిగా చదివారు. చాలా మంది నమ్మారు కూడా. వాట్సాప్‌ అనేది నిత్య జీవితంలో మనకి ఒక భాగమైంది. వాట్సాప్‌లో ఏది వచ్చినా అదే సత్యమని నమ్మేవారు ఎక్కువగా ఉన్నారు. అందుకే పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠా తిరుగుతోందని వచ్చిన ఒక తప్పడు వార్తతో విచక్షణ కోల్పోయిన జనం 30 మందిని కొట్టి చంపడాన్ని వాట్సాప్‌ చీకటికోణాన్ని బయటపెడుతోంది. కుల, మత, లింగ వివక్షలు చెలరేగేలా వాట్సాప్‌లో మెసేజ్‌లు వ్యాప్తి చెందుతుం డటం సమాజంలో స్పష్టమైన చీలికల్ని తెస్తోంది. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించలేకపోవడానికి అడ్డంకిగా మారే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. 

పరిమితులు విధించినా..
వాట్సాప్‌ దుర్వినియోగం కాకుండా ఆ సంస్థ మెసేజ్‌ను ఫ్వార్వార్డ్‌కు కొన్ని పరిమితుల్ని విధించింది. గత 3 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల గ్రూపుల్ని తొలగించింది. ఈ పరిమితుల తర్వాత కూడా ఒకేసారి 256 మంది ఉన్న గ్రూప్‌కి మనం మెసేజ్‌ను ఫార్వార్డ్‌ చేయవచ్చు. అలా ఐదుసార్లు ఫార్వార్డ్‌ చేసినా.. కొద్ది సెకండ్లలోనే 1280 మందికి చేరుతుంది. వాట్సాప్‌ వల్ల ఉన్న మరో నష్టమేమిటంటే పాత సమాచారం కూడా మళ్లీ తాజాగా వ్యాప్తి చేస్తూ ఉం టారు. దీనివల్లా అనర్థాలు జరుగుతున్నాయి. వాట్సాప్‌ వినియోగదారుల భద్రత కోసం పెట్టిన ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్టడ్‌ ఆప్షన్‌ దొంగోడి చేతిలో తాళం పెట్టినట్టుగా మారింది. ఫేక్‌ న్యూస్‌ ఎవరు వ్యాప్తి చేస్తున్నారో తెలుసుకోవడం కష్టమైపోతోంది.  తప్పుడు సమాచారం ఎక్కడ్నుంచి  వస్తుందో తెలుసుకోవడం ఆ సంస్థదే బాధ్యతని రాజకీయ పార్టీలు  అంటూ ఉంటే, వాట్సాప్‌ భద్రత కోసం పెట్టిన ఎన్‌క్రిప్టడ్‌ ఆప్షన్‌ వల్ల అది సాధ్యం కాదంటూ ఆ సంస్థ చేతులెత్తేసింది. ముఖ్యంగా రాజకీయ పార్టీలే ఎన్నికల సమయంలో వాట్సాప్‌ను దుర్వినియోగం చేస్తున్నాయంటూ ఆ సంస్థ ఎదురుదాడికి  దిగుతోంది.  ఈ డిజిటల్‌ ప్రపంచంలో ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు ఎన్ని మాయలైనా  చేస్తాయి. ఇందులో ప్రచారమయ్యే సత్యాసత్యాలకు  ఓటర్లు ఎంతవరకు ప్రభావితం అవుతారో చెప్పలేని పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ మాత్రమే సమర్థవంతంగా సోషల్‌ మీడియాని వినియోగించుకుంది కానీ ఈ సారి అన్ని పార్టీలు రంగంలోకి దిగి వాట్సాప్‌ గ్రూపులు క్రియేట్‌ చేస్తూ ఉండడంతో అంతిమంగా ఎవరికి ప్రయోజనం చేకూరుతుందో చూడాలి.  

ట్విటర్‌ వార్‌ టీమ్స్‌ రెడీ  
మండుటెండల్లో  చెమట్లు కక్కుకుంటూ గల్లీ గల్లీ తిరుగుతూ డజనుకు పైగా ర్యాలీల్లో  పాల్గొన్నా రాని ప్రచారం  ఒకే ఒక్క ట్వీట్‌తో వచ్చేస్తుంది. రాజకీయ హీట్‌ తగిలేలా ఒక్క ట్వీట్‌ చేస్తే చాలు వివాదానికి వివాదం. ప్రచారానికి ప్రచారం. 2019 ఎన్నికల్లో ట్విటర్‌ ప్రచారానికి బీజేపీ, కాంగ్రెస్‌లు పోటీ పడుతున్నాయి. ట్విటర్‌లో చురుగ్గా ఉంటూ నెటిజన్లను ఆకర్షించగలిగే సత్తా ఉన్న యోధానుయోధులతో సమరం సాగిస్తున్నాయి. సంఖ్యాపరంగా ఫాలోవర్లలో మోదీకి, రాహుల్‌కి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కానీ ట్వీట్లకి వచ్చే లైక్‌లు, రీట్వీట్లు వంటి అంశాల్లో మోదీతో రాహుల్‌ పోటీ పడుతున్నారు. కాక రేపే కామెంట్లు పెడుతూ అందరినీ ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల వేళ రెండు పార్టీలూ ట్విటర్‌ సైన్యాన్ని సిద్ధం చేశాయి.  

బీజేపీ సైన్యం  
బీజేపీ ఉపాధ్యక్షుడు శ్యామ్‌ జాజూ ఆ««ధ్వర్యంలో 13 మంది సభ్యులతో జాతీ య ఐటీ, సోషల్‌ మీడియా ప్రచార కమి టీ ఏర్పాటైంది. శ్యామ్‌ జాజూ ట్విటర్‌లో చురుగ్గా ఉంటారు. వర్తమాన అంశాలపై ట్వీట్లు పెడుతుంటారు. ఇక పార్టీ ఐటీ సెల్‌ ఇన్‌చార్జ్‌ అమిత్‌ మాలవీయకు 2.60 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. బీజేపీ తరఫున అత్యధికంగా ట్వీట్లు చేసేవారిలో అధికార ప్రతినిధులు నూపుర్‌ శర్మ (1.76 లక్షల ఫాలోవర్లు), ఖేమ్‌చంద్‌ శర్మ (27.4 వేల ఫాలోవర్లు), విదేశీ వ్యవహారాల శాఖ ఇన్‌చార్జ్‌ విజయ్‌ చతైవాలి (25.3 వేల ఫాలోవర్లు) ఉన్నారు. వీరంతా ఈ ఎన్నికల్లో సైన్యంలా పని చేయనున్నారు.  

కాంగ్రెస్‌ సేన
కన్నడ నటి రమ్యగా అందరికీ చిరపరిచుతురాలైన దివ్య స్పందన, కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌... ఆమెకు ట్విట్టర్‌లో 8.13 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. బీజేపీని, కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. కాంగ్రెస్‌ మీడియా సెల్‌కి అయిదుగురు కన్వీనర్లు ఉన్నారు. హసీబా అమిన్, రుచిర చతుర్వేది, సరాల్‌ పటేల్, ప్రణవ్‌ వచ్చరజని, జెహెబ్‌ షేక్‌లు కన్వీనర్లుగా ట్విటర్‌లో ఎన్నికల ప్రచారం చేస్తారు. ఇక కాంగ్రెస్‌ కమ్యూనికేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఇన్‌చార్జ్‌ రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా 7.14 లక్షల ఫాలోవర్లతో ట్విటర్‌లో సత్తా చాటగలరు. ఫాలోవర్లలో బీజేపీతో కాం గ్రెస్‌ పోటీపడలేకపోతోంది. కానీ, ఎన్నికల యుద్ధంలో ఎప్పుడొచ్చామన్నది కాదు.. ఓటు పడిందా? లేదా? అన్నదే ముఖ్యం. కాంగ్రెస్‌ అదే బాటలో డిఫరెంట్‌ ట్వీట్లు చేస్తూ అందరినీ ఆకర్షించే యత్నం  చేస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement