‘తెడ్డు’ తిరగబడింది.. నయవంచనపై యుద్ధాన్ని ప్రకటించింది! ‘ఏరు దాటేదాకా మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న..’ అనే తీరుగా ప్రవర్తిస్తున్న సీఎం చంద్రబాబుపై మత్స్యకారులు మండిపడుతున్నారు. ఎన్నికల్లో టీడీపీని మట్టికరిపించాలంటూ నమ్మక ద్రోహంపై తెడ్డు ఎక్కుపెట్టారు. మత్స్యకారులను ఎస్టీల జాబితాలో చేరుస్తామని గత ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ శాంతియుతంగా 75 రోజులు నిరాహార దీక్షలు చేస్తే టెంట్లు కూల్చేసి బూటుకాళ్లతో తొక్కేసిన ఘటనను తమ జాతి విస్మరించదని, ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారు. సునామీలు, తుపాన్లకు ఎదురొడ్డిన తాము చంద్రబాబు సర్కారును ఉప్పెనలా కూల్చేస్తామని సిక్కోలు గంగపుత్రులు ఊరూవాడా గర్జిస్తున్నారు.
టీడీపీకి వ్యతిరేకంగా ఊరూరా కరపత్రాలు...
రాష్ట్రంలో మత్స్యకారులు తమను ఎస్టీల జాబితాలో చేర్చాలని చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మత్స్యకార నాయకులు ఆయన్ను పలుమార్లు కలసి హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ వచ్చారు. చివరకు తాము మోసపోయామని గుర్తించి 2017 డిసెంబర్ 11న శ్రీకాకుళంలో 110 గ్రామాలకు చెందిన మత్స్యకారులు నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఏకంగా 75 రోజుల పాటు దీక్షలు కొనసాగాయి. ఎస్టీ సాధన సమితి ఉద్యమం విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఇతర జిల్లాలకు కూడా విస్తరించింది. హామీని నిలబెట్టుకోకపోగా ఉద్యమాన్ని సర్కారు ఉక్కుపాదంతో అణచి వేయడంపై నిరసనలు భగ్గుమన్నాయి.
జిల్లా మంత్రులు కూడా చేతులెత్తేయడంతో టీడీపీకి రాజీనామా చేయాలని శ్రీకాకుళం జిల్లా మత్స్యకార నేతలు నిర్ణయించారు. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే మూడు వేల మందికిపైగా మత్స్యకారులు టీడీపీకి రాజీనామా చేశారు. వీరంతా వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలవాలని నిర్ణయించారు. టీడీపీ పెద్దలు రంగంలోకి దిగి ఉద్యమ నేతలకు ఎమ్మెల్సీ పదవి ఎర వేసినా లొంగలేదు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలోని 110 మత్స్యకార గ్రామాల్లో చంద్రబాబు మోసాన్ని కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. విభజన హామీలను కేంద్రం అమలు చేయలేదని ప్రస్తావించే చంద్రబాబు తమకు చేసిన వాగ్దానంపై మాట తప్పడాన్ని మత్స్యకారులు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే తమకు న్యాయం జరుగుతుందంటూ ఊరూరా వివరిస్తున్నారు.
– బొల్లం కోటేశ్వరరావు సాక్షి ప్రత్యేక ప్రతినిధి, శ్రీకాకుళం
టీడీపీకి ఓటేయరాదని నిర్ణయించాం...
మమ్మల్ని ఎస్టీల జాబితాలో చేరుస్తామని గత ఏడాది ప్రపంచ మత్స్యకార దినోత్సవం రోజు కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ రోజు కులవృత్తి ప్రకారం ఆయనకు తలగోడ (బుంగ) నెత్తికి పెట్టాం. కానీ మోసం చేశారు. విశాఖలో తాట తీస్తానని హెచ్చరించి మా జాతిని అవమానించారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి ఓటేయొద్దని ఊరూరా చాటి చెబుతున్నాం.
–కొమర శంకర్రావు, జిల్లా అధ్యక్షుడు, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిషరీస్
మా ఉసురు తగులుతుంది..
గంగమ్మ తల్లిని నమ్ముకున్న బిడ్డలం. ఎస్టీల్లో చేరుస్తామని ఇచ్చిన హామీ అమలు కోసం దీక్షలు చేస్తుంటే మా టెంట్లను తగలబెట్టించిన చంద్రబాబుకు మా ఉసురు తగులుతుంది. బాబు మోసానికి నిరసనగా టీడీపీకి రాజీనామా చేసి బయటకొచ్చా.
–కోరాడ నర్సింగరావు, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర మాజీ కార్యదర్శి బలరాంపురం,
ఇంత మోసగాడనుకోలేదు..
చంద్రబాబు ఇంత మోసగాడనుకోలేదు. మూడుసార్లు అమరావతిలో ముఖ్యమంత్రిని కలిశాం. ఇక మంత్రి అచ్చెన్నాయుడిని 30 సార్లు కలిసి ఉంటాం. ఎస్టీల జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఏడాదిగా మభ్యపెడుతూ వచ్చారు. ఈ మోసాన్ని గుర్తించే టీడీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నాం. నేను పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో ఉన్నా. శ్రీకాకుళం పట్టణ ఉపాధ్యక్షుడిగా, కౌన్సిలర్‌గా పనిచేశా. –దూడ సుధాకర్ (ఎస్టీ సాధన సమితి శ్రీకాకుళం జిల్లా కన్వీనర్)
Comments
Please login to add a commentAdd a comment