సాక్షి, హైదరాబాద్: ఇటీవల హత్యకు గురైన కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ సతీమణి, నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మిని నల్లగొండ అసెంబ్లీ స్థానంలో పోటీకి దింపాలని టీపీసీసీ యోచిస్తోంది. దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ప్రకటన చేయించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి రంగంలోకి దింపాలని యోచిస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ ప్రతిపాదనకు సుముఖంగానే ఉన్నట్టు టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి.
అధికార పార్టీని ఎండగట్టేందుకు..
కాంగ్రెస్ పార్టీకి చెందిన బొడ్డుపల్లి శ్రీనివాస్‌ను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హత్య చేయించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ హత్య కేసులో నిందితులు ఆ ఘటనకు ముందు, తరువాత కూడా ఎమ్మెల్యే వేముల వీరేశం బంధువులతో ఫోన్‌లో మాట్లాడినట్టు కాల్‌డేటా బయటపడింది. దీంతో టీఆర్‌ఎస్ నేతలే శ్రీనివాస్ హత్యకు బాధ్యులంటూ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. ఇదే ఊపులో టీఆర్‌ఎస్‌ను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడానికి ఈ అంశాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించింది.
బొడ్డుపల్లి శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించడానికి ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీని పిలవాలని.. అదే సందర్భంగా లక్ష్మిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటన చేయించాలని టీపీసీసీ భావిస్తోంది. ఒకవేళ రాహుల్ పర్యటన సాధ్యం కాకుంటే.. ఏఐసీసీ ముఖ్యులతో ప్రకటన చేయించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. బీసీ సామాజికవర్గానికి చెందిన బొడ్డుపల్లి లక్ష్మికి అవకాశమివ్వడం కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక కోమటిరెడ్డి కూడా లోక్‌సభకు పోటీచేయాలన్న ఆసక్తితో ఉన్నట్టు పలుమార్లు బహిరంగంగానే వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment