
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గుజరాత్ ఎన్నికల కోసం ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ప్రచారంలో భాగంగా నేటి నుంచి ఆయన మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ స్పందించింది.
రాహుల్ ప్రచారం చేసినా కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి చెబుతున్నారు. సోమవారం ఉదయం విలేకరులతో మాట్లాడిన ఆయన... ‘కావాలంటే రాహుల్ దేశంలో ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చు. కానీ, దాని వల్ల ఏం అతనికి, పార్టీకి ఏం ఒరగదు’ అని చెప్పారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా గుజరాత్‌లో బీజేపీ గెలుపు ఖాయమని స్వామి ఉద్ఘాటించారు.
ఇక మూడు దశాబ్దాలుగా బీజేపీ కంచుకోటగా ఉన్న గుజరాత్‌లో ఎలాగైనా విజయం సాధించాలన్న ధీమాతో కాంగ్రెస్ ఉంది. ముఖ్యంగా పటేల్ ఉద్యమంను ప్రధానాశంగా చేసుకుని ప్రచారం నిర్వహించాలని భావిస్తోంది. సోమవారం ద్వారకలోని కృష్ణ ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం రాహుల్ తన పర్యటనను కొనసాగించనున్నారు. ‘రాహుల్ నిజాయితీపరుడైన నేత. ఆయన ప్రసంగం కోసం గుజరాత్ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి శక్తిసిన్హ్ గోహ్లి మీడియా సమావేశంలో తెలియజేశారు.