మాట్లాడుతున్న సుబ్రహ్మణ్యస్వామి
రాయదుర్గం: స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత్‌కు వచ్చిన హిందువులందరికీ దేశ పౌరసత్వం ఇస్తారని రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. భారత్‌లో పుట్టిన ముస్లింలకు సీఏఏ ఏ మాత్రం వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలోని సావిత్రిబాయిపూలే ఆడిటోరియంలో బుధవారం రాత్రి అఖిల భారత విద్యార్థి పరిషత్ హెచ్‌సీయూ శాఖ ఆధ్వర్యంలో‘సీఏఏ– ఏ హిస్టోరికల్ ఇంప్యారిటివ్ బియాండ్ కాంటెంపరరీ పాలిటిక్స్’ అంశంపై ఆయన ప్రత్యేక ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ భారతదేశం ధర్మసత్రం కాదని ఎవరు పడితే వారు వచ్చి ఇక్కడ పౌరసత్వం తీసుకుంటామంటే ఒప్పుకునేది లేదన్నారు. అందుకే కేంద్రం ప్రత్యేక చట్టం తెచ్చిందన్నారు.
ఈ చట్టం భారత్‌లో పుట్టిన ఏ మతానికి వ్యతిరేకం కాదని కొందరు కావాలనే అపోహలు సృష్టిస్తున్నారని, చట్టంలో లోపాలు ఉన్నాయని, ఒక మతానికి వ్యతిరేకమని నిరూపించాలని ఆయన చాలెంజ్ చేశారు. రోహింగ్యాలు స్వాతంత్య్ర సమయంలో బర్మాకు వెళ్ళేందుకు సిద్దపడి వినతిపత్రాలు ఇచ్చారని, ఆ తర్వాత 1949లో పాకిస్తాన్ వెళ్తామని చెప్పారని, కానీ ఎప్పుడు కూడా ఇండియాలోకి వస్తామని చెప్పలేదని ఆయన గుర్తు చేశారు. ఇజ్రాయిల్‌కు చెందిన పార్సీలు, ఆంగ్లో ఇండియన్లు కూడా ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారని, ఆంగ్లో ఇండియన్లకు చట్టసభల్లో ప్రత్యేక సభ్యత్వం ఇచ్చారన్నారు. భారత దేశం అన్ని కులాలకు, మతాలకు సమాన ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సీఏఏ చట్టం ఎవరికో వ్యతిరేకంగా తీసుకురాలేదని, భారత దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ అనుకూలంగానే ఉందని ఆయన పేర్కొన్నారు.రోహిత్ కుమార్, అజిత్‌కుమార్, అశోక్, బాలకృష్ణ, సురేష్, మనోజ్ పాల్గొన్నారు.
వచ్చే పదేళ్లలో బలమైన ఆర్థిక శక్తిగా భారత్
సాక్షి, సిటీబ్యూరో: వచ్చే పదేళ్లలో భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఆవిర్భవిస్తుందని రాజ్యసభ సభ్యులు సుబ్రమణ్య స్వామి అన్నారు. 2020–21 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల వృద్ధి సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ప్రజ్ఞా భారతి’ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన 2030 నాటికి ‘బలమైన ఆర్థిక శక్తిగా భారత్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. స్వాతంత్రం నాటి నుంచి 1990 వరకు భారత్ అంతగా అభివృద్ధి చెందలేదని, ఏడాదికి 3.5 శాతం మాత్రమే జీడీపీ వృద్ధి సాధించిందన్నారు. ఇందుకు జవహర్ లాల్ నెహ్రూ విధానాలే కారణమని ఆరోపించారు. నెహ్రూ సోవియట్ ఆర్థిక విధానాల కారణంగానే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. తిరిగి పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంతో ఏడాదికి 8శాతం జీడీపి వృద్ధి సాధించిందన్నారు. అనంతరం వచ్చిన మన్మోహన్ సింగ్ కూడా వాటిని కొనసాగిం చారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తున్నారని, నిరుద్యోగ నిర్మూలన, పేదరిక నిర్మూలనపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించిందన్నారు. ఏడాదికి 10శాతం వృద్ధితో వచ్చే పదేళ్లలో భారత్ చైనాను అధిగమిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment