సాక్షి, విజయవాడ : కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం టీడీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఎంతో సన్నిహితంగా ముఖ్యంగా పార్టీ ఆర్థిక వ్యవహారాల్లో కీలకపాత్ర పోషించే సుజనా చౌదరి పార్టీ మారబోతున్నారన్న వార్త ఆ పార్టీ నేతల్లో గుప్పుమంది. ఇంతకాలం కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన సుజనా చౌదరి మంత్రివర్గం నుంచి బయటకొచ్చిన కొద్ది రోజుల తర్వాత కాలం నుంచి ఆయన బీజేపీలో చేరబోతున్నారని టీడీపీ వర్గాల్లో చర్చోపచర్చలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన కుమారుడు లోకేష్ కు కూడా అత్యంత సన్నిహితంగా ఉంటున్న సుజనా చౌదరి బీజేపీలో చేరడమేంటన్న అంశంపైనే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.
చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సుజనా చౌదరి పార్టీ మారాలన్న ఆలోచన వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉండొచ్చని టీడీపీలోనే బలంగా వినిపిస్తోంది. చంద్రబాబును కాదని ఏ పనీ చేయని సుజనా చౌదరి ఉన్నట్టుండి బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకోవడం పట్ల రాజకీయవర్గాల్లో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుజనా చౌదరి కేంద్రంలో మంత్రిగా కొనసాగినన్ని రోజులు చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకున్నారు. కేబినేట్ హోదాలో ఉన్న అశోక గజపతి రాజుకన్నా కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్న అనేక విషయాలకు సంబంధించి సుజనా చౌదరి ద్వారానే చంద్రబాబు సమాచారం తెప్పించుకునే వారని పార్టీ వారు చెబుతుంటారు. పైగా 2009, 2014 ఎన్నికల సందర్భంలో పార్టీ ఆర్థిక లావాదేవీల నిర్వహణలో సుజనా చౌదరి కీలక పాత్ర పోషించారని అంటారు. అలాంటి సుజనా చౌదరి బీజేపీలో చేరడంలోని ఆంతర్యమేంటన్న చర్చ సర్వత్రా మొదలైంది.
రాజకీయంగా సుజనా చౌదరి ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ పాల్గొనలేదు. పైగా ఆయన చేరికవల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీకి పెద్దగా ఒరిగే అదనపు ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు. ఢిల్లీ స్థాయిలో బీజేపీకి చెందిన కొందరు ముఖ్య నాయకులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న సుజనా చౌదరి చేరికను స్థానిక బీజేపీ నాయకత్వం అంతగా పట్టించుకోవడం లేదు. అయినప్పటికీ ఆయన బీజేపీలో చేరడానికి సిద్ధపడటం వెనుక బలమైన కారణం ఏదో ఉండొచ్చన్న వాదన వినిపిస్తోంది. నాలుగేళ్ల పాటు కేంద్రంలో బీజేపీతో అధికారం పంచుకున్న చంద్రబాబు నాయుడు ఇటీవలి కాలంలో ప్రత్యేక హోదా అంశంపై ప్రజల ఆగ్రహజ్వాలల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. పైకి అలా చేసినప్పటికీ చంద్రబాబు ఇప్పటికీ బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవలి టీటీడీ పాలక మండలి నియామకం విషయంలో కూడా ఆ విషయం బయటపడింది. గత సంప్రదాయాలకు విరుద్ధంగా మహారాష్ట్రకు చెందిన బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక మంత్రి సుధీర్ మునగంటివార్ భార్యను టీటీడీ పాలక మండలి సభ్యురాలిగా నియమించడం కూడా అందులో భాగంగానే జరిగిందని చెబుతున్నారు.
లోకేశ్ సమాధానంతోనే....
బీజేపీతో లోపాయకారి సంబంధాలు కొనసాగిస్తున్న చంద్రబాబు ఆ క్రమంలోనే సుజనా చౌదరిని ఆ పార్టీలోకి పంపించే వ్యూహం పన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు అనుమతి లేకుండా సుజనా చౌదరి పార్టీ మారాలన్న నిర్ణయానికి రాలేరని, వారిద్దరి మధ్య సంబంధాలు అంతగా బలమైనవని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. సుజనా చౌదరి బీజేపీలోకి వెళుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై పార్టీ నేతల ప్రశ్న మంత్రి లోకేశ్ ఇచ్చిన సమాధానం కూడా అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో కూడిన వాట్సాప్ గ్రూప్ లో సుజనా చౌదరి బీజేపీలోకి వెళుతున్నట్టు ప్రచారం జరుగుతోందన్న విషయాన్ని ఒకరు లేవనెత్తగా, దానిపై లోకేశ్ స్పందించిన తీరు కూడా పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.
వాట్సాప్ గ్రూపులో... మాకు అలాంటి సమాచారం ఏదీ అందలేదు. వాస్తవం వెలుగులోకి వచ్చేవరకు వేచిచూద్దాం... లోకేశ్ కామెంట్ చేసినట్టు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ డెక్కన్ క్రానికల్ ఒక కథనం ప్రచురించింది. లోకేశ్ స్పందన అటు నిర్ధారించడం కానీ, ఇటు ఖండించడం కానీ కాకుండా తటస్థంగా ఉండటంతో సుజనా చౌదరి బీజేపీలోకి ఫిరాయించే విషయంపై గ్రూప్‌లో మరింత చర్చకు దారితీసిందని ఆ పత్రిక పేర్కొంది. ప్రస్తుతం సుజనా చౌదరి తీరు టీడీపీ అంతటా చర్చనీయాంశంగా మారిందని, సుజనా దారిలోనే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీని వీడే అవకాశముందని సీనియర్ నేత ఒకరు తెలిపారు.
2014 ఎన్నికల్లో టీడీపీకి విరాళాల సేకరణ, ఇతర పార్టీల నేతల చేరికల విషయంలో సుజనా కీలకంగా వ్యవహరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన విషయాల్లోనూ ఆయన ప్రధాన పాత్ర వహించారు. కేబినెట్ మంత్రుల ఖరారు నుంచి కీలక కీలక ప్రాజెక్టుల అప్పగింత వరకు ఆయన కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబుకు విశ్వసనీయుడు కావడంతో కేంద్రమంత్రి పదవి కూడా ఆయనను వరించింది. చంద్రబాబు సందేశాలను ప్రధానమంత్రి, కేంద్రమంత్రులకు చేరవేయడంలో, ఢిల్లీలో టీడీపీ తరఫున పనిచేయడంలో సుజనా ప్రముఖంగా వ్యవహరించారు.
అయితే, ఇటీవలి కాలంలో సుజనా చౌదరితో లోకేశ్ కు మధ్య సంబంధాలు బెడిసికొట్టాయని, ఈ నేపథ్యంలోనే పార్టీ మారుతున్నారన్న ప్రచారాన్ని పార్టీ నేతలు తెరమీదకు తెచ్చారు. కానీ అలాంటి సంఘటనలేవీ వారిమధ్య చోటుచేసుకోలేదని సన్నిహితులు చెబుతున్నారు. వారిమధ్య ఇప్పటికీ మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని, చంద్రబాబు ఆదేశాల మేరకు కొద్ది రోజుల కిందట సుజనా చౌదరి రాష్ట్ర గవర్నర్ తో సమావేశమయ్యారని అంటున్నారు. భవిష్యత్తు అవసరాలు, బీజేపీతో దూరం జరగడం ఇష్టం లేని చంద్రబాబు ముందస్తు రాజకీయ ఆలోచన మేరకే అత్యంత సన్నిహితుడైన సుజనా చౌదరిని బీజేపీలోకి పంపిస్తున్నారని టీటీపీలోని కొందరు కీలక నేతలు ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment