
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ రాజకీయ, ఆర్థిక విధానాలను ఎదుర్కొనేందుకు వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులు ఏకం కావాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నుంచి మూడు రోజులపాటు విజయవాడలో జరిగే పార్టీ జాతీయ సమితి సమావేశాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
దళితులు, కమ్యూనిస్టులు కలసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తోందన్నారు. మతం పేరిట దళితులు, మైనారిటీలపై దాడులు పెరుగుతున్నాయన్నారు. అంతకుముందు పార్టీ సీనియర్ నేత షమీమ్ ఫైజ్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యదర్శి నివేదికను, రాజకీయ ముసాయిదాను సురవరం ప్రవేశ పెట్టారు. రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాల్లో పార్టీ జాతీయ నేతలు డి.రాజా, అతుల్ కుమార్ అంజన్, కె.నారాయణ, పన్నీర్ రవీంద్రన్, రామేంద్ర, నాగేంద్రనాథ్ ఝా తదితరులు పాల్గొన్నారు.