
సాక్షి, హైదరాబాద్ : పౌరసత్వానికి సంబంధించిన దుర్మార్గమైన సవరణను తక్షణమే వెనక్కి తీసుకోవాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముస్లింలకు తప్ప ఎవరికైనా పౌరసత్వం ఇస్తామని కేంద్రం చెప్పడం విచారకరన్నారు. ఇది ముస్లింల పట్ల బీజేపీ వ్యతిరేకతను స్పష్టం చేస్తుందని పేర్కొన్నారు. రాఫెల్ డీల్‌కు సంబంధించిన కొత్తకొత్త అంశాలు బయటకు వస్తున్నాయని తెలిపారు. ఈ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మోదీదే అన్నారు. రాఫెల్ డీల్ అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేస్తాం : చాడ
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఎన్నికల్లో కలిసి వచ్చేవారిని కలుపుకుని ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం లేదా మహబూబాబాద్, నల్లగొండ లేదా భువనగిరి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు వివరించారు. ఏపీ ప్రత్యేక హోదా అంశానికి సీపీఐ మద్దతిస్తుందని తెలిపారు.
అంతేకాక కేసీఆర్ ఒంటరిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. నేటికి కూడా కేబినేట్ విస్తరణపై స్పష్టత రాలేదని.. కేబినేట్ లేకపోవడం వల్ల రోజుకు వెయ్యికి పైగా ఫైల్స్ ఆగిపోతున్నాయని ఆరోపించారు. కనీసం మంత్రివర్గం లేకుండానే విధానపరమైన నిర్ణయాలను తీసుకుంటున్నారని మండి పడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులను ఆత్మహత్యలవైపు ప్రోత్సాహించేలా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో జరగబోయే భూముల వేలాన్ని సీపీఐ అడ్డుకుంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment