ఢిల్లీకి తమిళనాడు గవర్నర్‌ | Tamil Nadu Governor meets President,and modi | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి తమిళనాడు గవర్నర్‌

Published Mon, Oct 9 2017 5:29 AM | Last Updated on Mon, Oct 9 2017 5:29 AM

Tamil Nadu Governor meets President,and modi

రాష్ట్ర గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ ఆదివారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలతో ఆయన భేటీ కానున్నారు. ఇందులో తమిళ రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

సాక్షి, చెన్నై: తమిళనాట సాగుతున్న రాజకీయ పరి ణామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలో పడి ఉండడంతో కోర్టు తీర్పు ఎలా ఉంటుందో, అందుకు తగ్గట్టుగా గవర్నర్‌ ఎలా స్పందిస్తారో అన్న ఎదురుచూపులు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో పూర్తిస్థాయి గవర్నర్‌గా బన్వరి లాల్‌ పురోహిత్‌ పగ్గాలు చేపట్టడంతో ఆయన అడుగులు ఎలా ఉండనున్నాయో అన్న ప్రశ్న బయలు దేరింది. గతంలో ఇతర రాష్ట్రాల్లో నెలకొన్న అనేక రాజకీయ సంక్లిష్ట పరిస్థితుల్ని చాకచక్యంగా వ్యవహరించి గట్టెక్కించిన బన్వరి లాల్‌ను తమిళ రాజకీయలు కాస్త ఇరకాటంలో పెట్టి ఉన్నాయని చెప్పవచ్చు. తమిళ రాజకీయాలపై పట్టు సాధించడంతో పాటు, తన మార్క్‌ కనిపించే రీతిలో ఆయన అడుగులు వేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇందుకు తగ్గట్టుగా ఢిల్లీ పెద్దల ఆశీస్సులతో, సర్వాధికారాల్ని గుప్పెట్లోకి తెచ్చుకుని తమిళ ప్రభుత్వంపై పట్టుకు ముందుకు సాగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు అద్దంపట్టే రీతిలో ఢిల్లీ పెద్దలతో సమాలోచనలు సాగించేందుకు గాను ఆదివారం  ఢిల్లీ పయనం కావడం గమనార్హం.

బిజీ షెడ్యూల్‌
మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో రాజ్‌ భవన్‌నుంచి చెన్నై విమానాశ్రయానికి గవర్నర్‌ బయలు దేరారు. అక్కడ ఇండిగో ఎయిర్‌ లైన్స్‌ విమానంలో ఢిల్లీ వెళ్లారు. సోమవారం బిజీ షెడ్యూల్‌తో ఢిల్లీ పర్యటన సాగనుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. తొలుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో, తదుపరి ప్రధాని నరేంద్రమోదీతో గవర్నర్‌ భేటీ సాగనుంది. ప్రధానంగా తమిళ రాజకీయాలు, ప్రభుత్వ బల పరీక్ష వ్యవహారం, అనర్హత వేటు వ్యవహారాలపై చర్చించి, తన అధికారాలు, పరిమితుల మేరకు నిర్ణయాలు తీసుకునే రీతిలో ఈ సమావేశం ద్వారా  ఆయన పెద్దల ఆశీస్సుల్ని అందుకునే అవకాశాలున్నట్టు తెలిసింది. అలాగే, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్, రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌లతోనూ భేటీకి బన్వరి లాల్‌ నిర్ణయించి ఉండటం గమనార్హం. మంగళవారం కూడా ఆయన ఢిల్లీలోనే ఉండి బుధ, గురువారం ఢిల్లీలో జరిగే రాష్ట్రాల గవర్నర్‌ల భేటీ ముగించుకున్న తదుపరి చెన్నైకి తిరుగు పయనం అవుతారని సమాచారం.

స్టాన్లీలో అగ్నిప్రమాదం
తిరువొత్తియూరు: స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం ఏర్పడింది. నాల్గవ అంతస్తులో జనరల్‌ చికిత్స విభాగంలో వైద్యులు ఉండేందుకు ఓ గది ఉంది. ఈ గదిలోని ఏసీ నుంచి శనివారం రాత్రి మంటలు ఏర్పడ్డాయి. డాక్టర్లు, నర్సులు, సిబ్బంది, రోగులు, సహాయకులు కిందకు పరుగెత్తారు. సమాచారం అందుకున్న  అగ్ని మాపక సిబ్బంది గంటపాటు పోరాడి మంటలు ఆర్పారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు ఏర్పడినట్టు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement