
గోదావరిఖని : తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) నుంచి తాను పూర్తిగా వైదొలగుతున్నట్లు ఆ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య ప్రకటించారు. యూనియన్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు రాజీనామా లేఖను అందజేసినట్లు పేర్కొన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పేరు పెట్టి పెద్ద చేసిన సంఘం నుంచి వైదొలగడం బాధగా ఉన్నా.. తప్పడం లేదన్నారు. సింగరేణి సంస్థలో 2003లో టీబీజీకేఎస్ పురుడు పోసుకుందని, అప్పటి నుంచి తాను సంస్థలో కీలక నాయ కుడిగా పని చేస్తున్నానని చెప్పారు. సింగరేణిలో ఒంటి చేత్తో సంఘాన్ని గెలిపించి గులాబీ జెండా ఎగురవేశామని గుర్తు చేశారు. అయినా.. సంఘంలో తనకే స్థానం లేకుండా పోయిందని వాపోయారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి చట్టబద్ధత లేదని జూన్ 21న ఓ వలసవాది ప్రకటించి తన స్థానమేమిటో తెలియజేశారని, ఈ విషయం తనకు ఎంతో బాధ కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. కాగా, మల్లయ్యతో పాటు ఎనిమిది మంది ముఖ్య నాయకులు కూడా రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment