Kengarla mallaiah
-
‘సింగరేణి సైరన్’తో బీజేపీకి షాకిచ్చిన టీఆర్ఎస్
గోదావరిఖని (రామగుండం): సింగరేణి ప్రాంతంలో పట్టుకు టీఆర్ఎస్ వ్యూహం రచిస్తోంది. త్వరలో రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే గతంలో పార్టీకి కీలకంగా ఉన్న నాయకుడు.. సింగరేణి సైరన్‌గా గుర్తింపు పొందిన నేతను తిరిగి చేర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ప్రయత్నం బీజేపీకి షాకిచ్చిలా ఉంది. ఆ ప్రయత్నాలు ఫలిస్తే బీజేపీ అనుబంధ సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్) అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య త్వరలో తన సొంతగూటికి చేరే అవకాశం ఉంది. టీఆర్ఎస్ అధిష్టానం నుంచి వచ్చిన ఆఫర్ మేరకే ఆయన బీఎంఎస్‌ను వీడారు. మల్లయ్య టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ ఆవిర్భావం నుంచి ఉన్నారు. ఒంటిచేతితో యూనియన్ను నడిపించాడు. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సింగరేణివ్యాప్తంగా ఉన్న 11 ప్రాంతాల్లో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. 2003 నుంచి సంఘాన్ని ముందుండి నడిపించారు. సుమారు 16 ఏళ్లు టీబీజీకేఎస్‌లో పనిచేసిన మల్లయ్య నాయకత్వ విభేదాలతో సంఘానికి దూరమయ్యారు. టీఆర్ఎస్ నుంచి కూడా హామీ రాకపోవడంతో పార్టీని వీడారు. అనంతరం 2019 సెప్టెంబర్ 30న బీజేపీ అనుబంధ బీఎంఎస్ (సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్)లో చేరారు. అక్కడ కూడా మల్లయ్య అధ్యక్షుడిగా నియమితులయ్యారు. రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో తీవ్ర పోటీ ఇచ్చి బీఎంఎస్ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో మల్లయ్య ముందుకెళ్తున్నారు. అయితే బీఎంఎస్‌లో గుర్తింపు రాకపోవడం, తాను ఆశించిన జేబీసీసీఐ సభ్యతం రాకపోవడంతో దీంతో మల్లయ్య అసంతృప్తిలో ఉన్నారు. ఈ కారణంగా మూడు నెలలుగా సంఘం కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ అసంతృప్తిని గ్రహించి టీఆర్ఎస్ మళ్లీ ఆహ్వానం పలికింది. ఈ క్రమంలోనే కెంగర్ల మల్లయ్యను తిరిగి టీబీజీకేఎస్, టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేందుకు మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. ఇటీవల టీఆర్ఎస్ అధిష్టానంతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ యువ, అధినాయకుడు కచ్చితమైన హామీ ఇవ్వడంతో శుక్రవారం తెల్లవారుజామున బీఎంఎస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. బీఎంఎస్‌కు రాజీనామా చేసిన మల్లయ్య గోదావరిఖనిలో తన అనుచరులతో సమావేశమై టీఆర్ఎస్లో చేరే విషయం చర్చించారు. త్వరలో జరిగే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలుపు కోసం ఇప్పుడే వ్యూహం సిద్ధం చేశారు. -
‘టీబీజీకేఎస్ నుంచి వైదొలగుతున్నా..!’
గోదావరిఖని : తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) నుంచి తాను పూర్తిగా వైదొలగుతున్నట్లు ఆ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య ప్రకటించారు. యూనియన్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు రాజీనామా లేఖను అందజేసినట్లు పేర్కొన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పేరు పెట్టి పెద్ద చేసిన సంఘం నుంచి వైదొలగడం బాధగా ఉన్నా.. తప్పడం లేదన్నారు. సింగరేణి సంస్థలో 2003లో టీబీజీకేఎస్ పురుడు పోసుకుందని, అప్పటి నుంచి తాను సంస్థలో కీలక నాయ కుడిగా పని చేస్తున్నానని చెప్పారు. సింగరేణిలో ఒంటి చేత్తో సంఘాన్ని గెలిపించి గులాబీ జెండా ఎగురవేశామని గుర్తు చేశారు. అయినా.. సంఘంలో తనకే స్థానం లేకుండా పోయిందని వాపోయారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి చట్టబద్ధత లేదని జూన్ 21న ఓ వలసవాది ప్రకటించి తన స్థానమేమిటో తెలియజేశారని, ఈ విషయం తనకు ఎంతో బాధ కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. కాగా, మల్లయ్యతో పాటు ఎనిమిది మంది ముఖ్య నాయకులు కూడా రాజీనామా చేసినట్లు ప్రకటించారు. -
టీబీజీకేఎస్ నేత రాజీనామా?
గోదావరిఖని : టీఆర్ఎస్ అనుబంధ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగెర్ల మల్లయ్య తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన అధికారికంగా ప్రకటించనున్నారని తెలిసింది. టీబీజీకేఎస్‌లో సరైన గుర్తింపు లేకపోవడంతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నెలాఖరులో కేంద్ర మంత్రుల సమక్షంలో ఆయన బీఎంఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా 2003లో పురుడు పోసుకున్న టీబీజీకేఎస్‌లో ఆది నుంచి పనిచేస్తున్న మల్లయ్య అనేక కీలక పదవుల్లో పనిచేశారు. యూనియన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శితో పాటు ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. టీబీజీకేఎస్‌లో ఉంటే గుర్తింపు లేదనే ఆలోచనతో మల్లయ్య బీఎంఎస్ వైపు దృష్టి సారించారు. అయితే బీజేపీ అగ్ర నాయకులతో భేటీ అయి కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. -
ఉనికి కోసమే జాతీయ సంఘాల ఆరాటం
► టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య రామగిరి(సెంటినరీకాలనీ) : జాతీయ కార్మిక సంఘాలు ఉనికి కోసం ఆరాట పడుతున్నాయని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య అన్నారు. శుక్రవారం ఆర్జీ–3 డివిజన్ పంచ్‌ఎంట్రీలో ఏర్పాటు చేసిన గేట్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లక్రితం జాతీయ సంఘాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగ హక్కును టీబీజీకేఎస్ యూని యన్ సాధించడంతో వారి ఉనికి ప్రశ్నార్థకంగా మారిందన్నార. అందుకే లేని పోని విమర్శలు చేస్తున్నారన్నారు. జాతీయ సంఘాలకు కార్మికులపై ప్రేమ ఉంటే వేజ్ బోర్డు లో మెరుగైన వేతనాల అమలుకు కృషి చేయాలన్నారు. దీపాళి బోనస్, మూడేళ్లకోసారి పెంచాల్సిన పెన్షన్ ఎందుకు పెంచలేకపోయారో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఉన్న సమయంలో వీఆర్ఎస్ కార్మికులకు యాజమాన్యంతో కుమ్మక్కై రూ. 2 లక్షలు ఇప్పించి కార్మికులను మోసం చేశారని ఆరోపించారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా టీబీజీకేఎస్ ఎన్నో హక్కులు సాధించిందన్నారు. రాబోయే ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలన్నారు. అనంతరం యూనియన్ లో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు ముద్దసాని రఘువీర్‌రెడ్డి, నాగెల్లి సాంభయ్య, కొట్టె భూమయ్య, ఇస్సంపెల్లి రమేశ్, పర్శ బక్కయ్య, వేగోలపు మల్లయ్య, దేవ శ్రీనివాస్, బత్తుల రమేశ్, రౌతు రమేశ్, గాజుల తిరుపతి, వీవీగౌడ్, పుల్లెల కిరణ్, రాజేందర్, మల్లేశ్, గిటుకు శ్రీనివాస్, ఓదెలు పాల్గొన్నారు. -
తెలంగాణ బిల్లు పెట్టకుంటే 22 నుంచి సింగరేణి సమ్మె
టీబీజీకెఎస్ అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య గోదావరిఖని,న్యూస్‌లైన్: పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని, లేనిపక్షంలో ఈ నెల 22 నుంచి సింగరేణి సంస్థలో సమ్మె చేపడతామని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఇప్పటికే సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చామన్నారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టని పక్షంలో సమ్మెను విజయవంతం చేసేందుకు మిగిలిన కార్మిక సంఘాలు కలిసిరావాలని కోరుతూ సంఘాలకు లేఖలు రాస్తున్నామని చెప్పారు. తెలంగాణను అడ్డుకోవడానికి సీమాంధ్ర నేతలు కుట్ర పన్నుతున్నారని, వాటిని కలిసి కట్టుగా ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్రకే పరిమితమై మాట్లాడడం శోచనీయమన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో సీఎంను గవర్నర్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.