చంద్రబాబు నువ్వు పెద్ద కొడుకువి కాదు...తాతవి | TDP Ex Leader Motukupalli Narsimhulu Fire On Chandra Babu Naidu In Hyderabad | Sakshi
Sakshi News home page

చంద్రబాబును చిత్తు చిత్తుగా ఓడించండి: మోత్కుపల్లి

Published Fri, Mar 29 2019 6:06 PM | Last Updated on Fri, Mar 29 2019 6:29 PM

TDP Ex Leader Motukupalli Narsimhulu Fire On Chandra Babu Naidu In Hyderabad - Sakshi

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై  మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. కాళ్లు మొక్కి గాంధీని చంపిన నాథూరాం గాడ్సే కంటే నీతిమాలిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. హైదరాబాద్‌లో మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తెలుగు దేశం పార్టీ పెట్టి ఈ రోజుకి 37 సంవత్సరాలు పూర్తి అయిందని, దళితుడినైన తాను ఎన్టీఆర్‌ క్యాబినేట్‌లో మంత్రి అయ్యానని, ప్రతిభా భారతి కూడా మంత్రి అయ్యారని తెలిపారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ డబ్బులు లేని వారికి కూడా టికెట్లు ఇచ్చారని గుర్తు చేశారు.

పదో గ్రహం చంద్రబాబు
‘గ్రహాలు 9 ఉన్నాయి కానీ 10వ గ్రహం నక్కజిత్తుల వ్యక్తి , దుర్మార్గుడు  అల్లుడిగా వచ్చారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తివి నీవు. పార్టీ సభ్యుడివి కూడా కాదు. పార్టీ జెండా మోయలేదు. కానీ ఈరోజు ఆయన పార్టీని అడ్టుపెట్టుకుని ముందుకు వెళ్తున్నావ్‌. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు నువ్వు(చంద్రబాబు) ఎక్కడున్నావ్‌. మాయ మాటలు చెప్పి మూడోసారి రాజ్యం ఏలుతున్నావ్‌. నీతి నిజాయతీ ఉంటే వెంటనే రాజకీయాల నుంచి తప్పుకోవాలి. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక, చేసింది చెప్పుకోలేక ఈ రోజు కేసీఆర్‌ను తిడుతున్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో దుప్పటి కప్పుకుని ఇంట్లో పడుకున్న పిరికి పందవు నీవు’  అంటూ తీవ్ర స్థాయిలో చంద్రబాబును మోత్కుపల్లి ఏకిపారేశారు.

ఎన్టీఆర్‌ను చెప్పులతో కొట్టించిన ఘనుడు బాబు
‘వైశ్రాయ్‌ హోటల్‌ దగ్గర ఎన్టీ రామారావును చెప్పులతో కొట్టించిన దుర్మార్గుడు చంద్రబాబు. ఓటుకు కోట్లు కేసులో దొంగను పట్టుకున్నట్టు పట్టుకుని నడి రోడ్డుపై కేసీఆర్‌ తంతే పారిపోయిన పిరికి పందవు నువ్వు(చంద్రబాబు నాయుడు). నాలుగేళ్లు మోదీతో పొత్తుపెట్టుకుని ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని లేఖ రాశావని కేంద్ర విద్యుత్‌ శాఖా మంత్రి స్వయంగా లేఖలు చూపించారు. మోదీయే మళ్లీ పీఎం కావాలి అంటూ అసెంబ్లీలో తీర్మానం చేసిన సీఎంవి నీవు. నోట్ల రద్దు నేనే(చంద్రబాబు) చేయించానని చెప్పి ఇప్పుడు మాట మార్చిన వ్యక్తివి. ఇతరులను దొంగ అని అంటున్నావ్‌..29 కేసుల్లో నువ్వు (చంద్రబాబు) ఎందుకు స్టే తెచ్చుకున్నావ్‌.. నీతి మంతుడివైతే విచారణకు సిద్ధపడాల’ ని మోత్కుపల్లి సవాల్‌ విసిరారు.

జగన్‌కు ఒక్కసారి అవకాశం ఇస్తే తప్పేంటి
నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతోన్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఒక్కసారి అవకాశం ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. 30 ఏండ్ల అనుభవం ఉన్న దళిత నాయకుడిగా తాను చెబుతున్నానని, కాపులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏకమై జగన్‌ను గెలిపించాలని కోరారు. చంద్రబాబును చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. డబ్బులు అందరి దగ్గర తీసుకుని ఓటు మాత్రం చంద్రబాబును ఓడించేందుకే వేయాలన్నారు. 

బాబు పోయాడు.. శని పోయింది
తెలంగాణాలో టీడీపీ పూర్తిగా కనుమరుగు కావడంతో చంద్రబాబు ఆంధ్రా పోయాడని, దీంతో తెలంగాణాకు శని పోయిందని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజలు కూడా చంద్రబాబును ఓడించి శని వదిలించుకోవాలని సూచించారు. తెలంగాణాలో కేసీఆర్‌ పెట్టిన పథకాలు, వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలు కాపీ కొడుతూ బాబు ఊదరగొడుతున్నాడని మండిపడ్డారు. సిగ్గు లేని రాబందు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. చచ్చేవరకూ బాబుకు అధికారం కావాలి.. ఆయన తదనంతరం కొడుకు లోకేష్‌కి అధికారం అప్పజెప్పాలనేదే బాబు ఆలోచన అని అన్నారు. ఎన్టీఆర్‌ ఎప్పుడూ వారసులను రాజకీయాల్లోకి వేలు పెట్టనీయలేదని చెప్పారు. బాబును టీడీపీ నుంచి 1995లోనే ఎన్టీఆర్‌ సస్పెండ్‌ చేశారని చెప్పారు.

బాబు వల్లే తెలంగాణ కాంగ్రెస్‌కు ఓటమి
నారా చంద్రబాబు నాయుడి వల్లే తెలంగాణాలో కాంగ్రెస్‌ ఓటమి పాలైందని ఆరోపించారు. నారా లోకేష్‌ గనక అడుగుపెడితే ఒక్క సీటు కూడా గెలవదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు మీటింగ్‌లలో ప్రసంగాలు వినివినీ చెవుల్లో రక్తాలు కారుతున్నాయని ఎద్దేవా చేశారు.  70 ఏళ్లు ఉన్న చంద్రబాబు నాయుడూ నువ్వు పెద్ద కొడుకువు ఎలా అవుతావ్‌.. పెద్ద తాతవు మాత్రమే అవుతావని చమత్కరించారు. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్న అధికారులను బదిలీ చేసిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

బీసీలు న్యాయమూర్తులు కాకుండా అడ్డుపడ్డ బాబు
దళితులు, బీసీలు న్యాయమూర్తులు కాకుండా చంద్రబాబు నాయుడు అడ్డుపడిన విషయాన్ని గుర్తుచేశారు. ఏప్రిల్‌ 1న బెజవాడ కనక దుర్గమ్మను దర్శించుకుని దుర్మార్గుడు చంద్రబాబు తల నరకమని కోరుకుంటానని చెప్పారు. తనకు రాజ్యసభ, గవర్నర్‌ పదవులు ఇస్తా అని చెప్పి, చివరకు రూ.100 కోట్లకు రాజ్యసభ సీటు అమ్ముకున్నాడని  ఆరోపించారు. ఒక్క రాజ్యసభ సీటైనా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చావా అని బాబును సూటిగా ప్రశ్నించారు.

బాబు ఉంటే ప్రత్యేక హోదా రాదు
తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా ఏపీ ప్రజల కోసం ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాయాలని కోరారు. కేసీఆర్‌ లేఖ రాస్తేనే న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబును మోదీ పట్టించుకోడు..రాహుల్‌ గాంధీ, బాబును అసలే నమ్మడని వ్యాఖ్యానించారు. ఎప్పటికీ చంద్రబాబు వల్ల ఏపీకి ప్రత్యేక హోదా రాదని చెప్పారు. ఎప్పటికైనా చంద్రబాబుపై సీబీఐ విచారణ జరుగుతుంది.. బాబు జైలుకు పోక తప్పదని జోస్యం చెప్పారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement