సాక్షి, విజయవాడ : టీడీపీ సీనియర్ నేత, సినీ నటి కవిత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సమక్షంలో విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆమె కమలం కండువా కప్పుకున్నారు. సినీ నటి కవిత టీడీపీలో కొంతకాలం కిందటి వరకు చురుగ్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
బాధతోనే టీడీపీకి రాజీనామా చేశానని, టీడీపీ నుంచి తనను అవమాననించి గెంటేశారని కవిత అన్నారు. బీజేపీలో చేరిన అనంతరం ఆమె మాట్లాడారు. 1983 నుంచి టీడీపీ కోసం కష్టపడి తాను సేవలు అందించానని చెప్పారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన అనేక పథకాలు నచ్చడంతోనే బీజేపీలో చేరానని తెలిపారు. టీడీపీ నుంచి తాను బయటకు రాలేదని, తనను గెంటేశారని ఆవేదనగా పేర్కొన్నారు. టీడీపీ బలోపేతం కోసం అహర్నిశలు పనిచేశానని, పార్టీ కోసం కష్టపడ్డందుకు అనేక అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపారు.
పనిచేసిన వారికి సముచితన్యాయం చేస్తానని చంద్రబాబు పదే పదే చెబితే.. నిజంగానే న్యాయం చేస్తారని అనుకున్నా.. కానీ, ఇప్పటివరకు తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు మోసకారి అని చాలా మంది చెబుతున్నా నమ్మలేదని, ఇప్పుడే అర్థమైందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌పై నమ్మకంతోనే టీడీపీలో చేరానని, చంద్రబాబు ఎన్టీఆర్ హామీని తుంగలో తొక్కారని మడిపడ్డారు. చంద్రబాబు ప్రతి పోరాటంలో తాను పాల్గొన్నానని, అయినా తనను అవమానించి, బాధపెట్టి గెంటేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment