సాక్షి, అమరావతి : టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకు గట్టి షాక్ తగిలింది. ఆయన సోదరుడు సన్యాసిపాత్రుడు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కుటుంబ సభ్యులతో సహా పార్టీలో చేరుతున్న సన్యాసిపాత్రుడుని సీఎం జగన్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సన్యాసిపాత్రుడుతో పాటు భార్య అనిత, నర్సీపట్నం మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. కాగా సన్యాసిపాత్రుడు నర్సీపట్నం మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఇక ఆయన సతీమణి అనిత మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా విధులు నిర్వర్తించారు.
కాగా టీడీపీ తీరుతో మనస్తాపం చెందిన సన్యాసిపాత్రుడు దంపతులు ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నర్సీపట్నం పర్యటనలో ఉండగానే సన్యాసిపాత్రుడు రాజీనామా చేసి పార్టీ అధిష్టానంతో పాటు సోదరుడు అయ్యన్నకు షాక్ ఇచ్చారు. రాజీనామా సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలో రెండేళ్లుగా తనకు ప్రాధాన్యత లేకుండా చేశారన్నారు. గ్రూపు రాజకీయాలు ప్రోత్సహించారని ఆరోపించారు. ఈ విషయాలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన చెందారు. తన పట్ల వ్యవహరించిన తీరుతో మనస్తాపం చెంది రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment