ప్రస్తుతం పచ్చపార్టీ కార్యాలయంగా మారిన సామాజిక భవనం
గాజువాక: అది సామాజిక భవనమన్న స్పృహ లేదు. ప్రజలకు ఉపయోగపడుతుందన్న ఆలోచన లేదు. అన్నింటికీ మించి ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్న భయం లేదు. ఏ అధికారి కొమ్ము కాస్తున్నాడో... ఏ ప్రజాప్రతినిధి వెనక నుంచి నడిపిస్తున్నాడో కానీ... ఒక సామాజిక భవనాన్ని టీడీపీ నాయకులు ఏకంగా తమ పార్టీ కార్యాలయంగా మార్చేయడానికి ఉపక్రమించారు. సామాజిక భవనాన్ని కొద్దిరోజులుగా తమ ఆక్రమణలోకి తీసుకున్న పచ్చబాబులు తాజాగా పసుపురంగు వేసి ఆ భవనం తమది అన్నట్టు చెప్పుకొంటున్నారు.
20 రోజుల క్రితం భవనం ప్రహరీకూలగొడుతున్న కూలీ (ఫైల్)
ప్రహరీ కూలగొట్టి... రంగులు మార్చి
జీవీఎంసీ 60వ వార్డులోని పాత గాజువాక దరి చిట్టినాయుడు కాలనీలో సుమారు 700 చదరపు గజాల స్థలంలో జీవీఎంసీ ఒక సామాజిక భవనాన్ని నిర్మించింది. దానికి సుమారు ఏడేళ్ల క్రితం రూ.10 లక్షలతో చుట్టూ ప్రహరీ కూడా నిర్మించారు. ప్రస్తుతం దాన్ని స్థానికులు తమ శుభకార్యాలకు, ఇతర సాంఘిక అవసరాలకు ఉపయోగించుకొంటున్నారు. దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని పథకం వేసిన టీడీపీ మాజీ కౌన్సిలర్ కొద్ది కాలం క్రితం ఎన్‌టీ రామారావుకు చెందిన విగ్రహాన్ని పెట్టించి భవనాన్ని తన ఆక్రమణలోకి తీసుకున్నాడు. 20 రోజుల క్రితం కొంతమంది కూలీలతో ప్రహరీ పడగొట్టించి తన అవసరాలకు అనుకూలంగా పునర్నిర్మించాడు. ఈ విషయంపై జీవీఎంసీ గాజువాక జోనల్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదు. కనీసం ఆ పనులను ఆపలేదు. దీంతో దూకుడు పెంచిన ఆక్రమణదారుడు ఇప్పుడు ఏకంగా ఆ సామాజిక భవనానికి పసుపురంగు వేసి టీడీపీ కార్యాలయంగా మార్చడానికి అన్ని ఏర్పాట్లూ చేశాడు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనని తెలిసినా ఏ అధికారీ పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ విషయంపై ఎన్నికల సంఘం యాప్ సీ విజిల్‌లో స్థానికులు ఫిర్యాదు చేయగా, సంబంధిత సిబ్బంది పరిశీలించి వెళ్లినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment