తూర్పుగోదావరి, ఏలేశ్వరం: గత కొంతకాలంగా ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీలో జరుగుతున్న కుమ్ములాటలపై మంగళవారం చంద్రబాబు వద్ద ప్రత్తిపాడు టీడీపీ నేతల పంచాయితీ సాగింది. టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, డీసీసీబీ ఛైర్మన్ వరుపుల రాజా, దివంగత మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు వర్గం టీడీపీ టిక్కెట్టు కోసం పావులు కదుపుతున్న విషయం విదితమే. ముఖ్యంగా తాతా మనవళ్లయిన వరుపుల సుబ్బారావు, వరుపుల రాజాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇద్దరూ ఎవరికి వారే గ్రూపులు కట్టి పార్టీలో పట్టుకోసం పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో దీనిపై అధిష్టానం దృష్టి సారించింది. దీనిలో భాగంగా తాతా, మనవళ్లతోపాటు పర్వత కుటుంబ సభ్యులను చర్చలకు చంద్రబాబు ఆహ్వానించారు.
భేటీలో డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా వైపు చంద్రబాబు మొగ్గు చూపించినట్లు తెలిసింది. దీనిపై ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాజకీయంలో అనుభవం ఉన్న వ్యక్తినని, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తనకే సీటు ఇవ్వాలని పట్టుబట్టారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ సర్వేలు ఆశాజనకంగా లేవని ఎమ్మెల్యేకు వివరించారు. సర్వేల వివరాలు చూపించాలని ఎమ్మెల్యే కోరగా పక్కనే ఉన్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రును ఉద్ధేశించి ‘నీ తోడల్లుడు సర్వే రిపోర్టులు అడుగుతున్నాడని ... పార్టీ సర్వేలు బహిర్గతం చేస్తారా’ అని ప్ర«శ్నించినట్లు తెలిసింది. దీనిపై జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల సమయంలో టికెట్ ఇస్తానని హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. సర్వేలు అనుకూలంగా లేనప్పుడు మాట నిలబెట్టుకోలేమని చంద్రబాబు అన్నట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ కష్టించి పనిచేసి పార్టీని గెలిపించాలని చంద్రబాబు కోరారు. దీనిపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేయగా వచ్చే నెల 1వ తేదీన మళ్లీ సమావేశం అవుదామని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. దీంతో వరుపుల నిరాశతో వెనుదిరిగారు. ఒకటి రెండు రోజుల్లో తన అనుచరులతో ఎమ్మెల్యే సమావేశం కానున్నట్లు తెలిసింది. భేటీలో తాతా మనవళ్లతోపాటు మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ, చిట్టిబాబు సోదరుడు పర్వత రాజుబాబు, పర్వత జానకీదేవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment