సాక్షి ప్రతినిధి, అనంతపురం: టీడీపీలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి స్పీడ్‌కు బ్రేక్ పడింది. పార్లమెంట్ పరిధిలో ఎవరినీ సంప్రదించకుండా ఒంటెత్తు పోకడలతో నిర్ణయం తీసుకుంటున్నఆయనపై ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తాను పార్టీలో చేర్చుకుంటే టీడీపీలో కొనసాగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అనంతపురం పార్లమెంట్‌ను జేసీ దివాకర్‌రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారని, ఆయన మాటలను పరిగణనలోకి తీసుకుంటే పార్టీ గంగలో కలవడం ఖాయమని తమ వాణి గట్టిగా వినిపించారు. దీంతో మధుసూదన్‌గుప్తా చేరిక వాయిదా పడింది.‘అనంత’ పార్లమెంట్ పరిధిలో తన ‘టీం’ను ఏర్పాటు చేసుకునే క్రమంలో భాగంగా గురునాథ్‌రెడ్డి చేరికతో తొలి పావు కదిపిన జేసీ, గుంతకల్లులో మధుసూదన్‌గుప్తాను పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేశారు. మహానాడు వేదికపైనే గుప్తాను పార్టీలోకి చేర్చుకునేలా ముఖ్యమంత్రితో మాట్లాడినట్లు తెలు స్తోంది.
సోమవారం సాయంత్రం గుప్తా పార్టీలో చేరాల్సి ఉంది. తన నియోజకవర్గ నేత చేరికపై తనకు మాటమాత్రం కూడా సమాచారం ఇవ్వకుండా చేర్చుకోవడాన్ని ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ తీవ్రంగా తప్పుబట్టారు. తనకు తెలియకుండా చేరిక కు సిద్ధమయ్యారంటే, తనకు టిక్కెట్టు రాదని జరుగుతున్న ప్రచారం నిజమేనని ఆయన నిర్ధారణకు వచ్చారు. ‘అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలు’ అన్నట్లు ఎలాగూ టిక్కెట్ల కేటాయింపుల్లో లొల్లి తప్పదు.. అదేదో ఇప్పుడే తేల్చుకుంటే సరిపోతుందనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిదీ ఇదే పరిస్థితి. దీంతో ఇద్దరూ ఏకమాయ్యరు. వీరిద్దరూ మంత్రి కాలవ శ్రీనివాసులను కలిసి విషయం చెప్పినట్లు తెలుస్తోంది. రాయదుర్గంలో తనకూ పొగబెట్టి, అల్లుడిని తెచ్చుకోవాలని జేసీ చూస్తున్నారని.. మంత్రిని కాబట్టి ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయానని కాలవ చెప్పినట్లు చర్చ జరుగుతోంది. వీరిద్దరి ఆవేశాన్ని కాలవ అస్త్రంగా చేసుకుని చంద్రబాబు రాజకీ య సలహాదారు, ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్‌కు ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వారు జనార్దన్‌ను కలిశారు. గుప్తాను పార్టీలో చేర్చుకుంటే మహానాడు వేదిక నుంచి వెళ్లిపోతామని, పార్టీలో కొనసాగే విషయంలో కూడా ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుందని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. మనసులో మాటను కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడంతో జనార్దన్.. కాసేపు ఆగండని వెంటనే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
జేసీపై ఫిర్యాదు.. పార్లమెంట్ పరిస్థితిపై నివేదిక కోరిన చంద్రబాబు
ప్రభాకర్‌చౌదరి, జితేంద్రగౌడ్‌లు జనార్దన్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత శింగనమల, కళ్యాణదుర్గం ఎమ్మెల్యేలు కూడా జనార్దన్‌ను కలిసినట్లు తెలిసింది. దివాకర్‌రెడ్డి తీరుతో పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేంతా ఇబ్బంది పడుతున్నారని, ఆయన చర్యలు పార్టీకి నష్టం వాటిల్లేలా ఉన్నాయని, వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కూడా జనార్దన్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఎమ్మెల్యేంతా జేసీపై ఫిర్యాదు చేయడంతో ముఖ్యమంత్రి మెట్టు దిగినట్లు తెలిసింది. అసలు ‘అనంత’ పార్లమెంట్ పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యేలు ఏమంటున్నారు? వారి పని తీరు? ఎంపీ పనితీరు? ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం, ప్రజల అభిప్రాయంతో పాటు పూర్తి నివేదిక తనకు ఇవ్వాలని జనార్దన్‌కు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో నివేదిక వచ్చే వరకూ గుప్తా చేరిక ఉండకపోవచ్చనే అభిప్రాయాన్ని టీడీపీ సీనియర్ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
నివేదికను బట్టి అనంతపురం ఎంపీ స్థానం నుంచి దివాకర్‌రెడ్డిని తప్పించి, వారి కుటుంబానికి తాడిపత్రి టిక్కెట్టు మాత్రమే కేటాయించే అవకాశం కూడా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దివాకర్‌రెడ్డికి ప్రస్తుతం టీడీపీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. మెజార్టీ ఎమ్మెల్యేలు ఎంపీపై ఫిర్యాదు చేస్తున్నారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ బీసీ నేతను పార్లమెంట్ బరిలో నిలపాలనే యోచనలో ఉంది. ఇంకోవైపు దివాకర్‌రెడ్డి ఇంట్లో రెండు టిక్కెట్లు ఇచ్చారు కాబట్టి, పరిటాల శ్రీరాంకు హిందూపురం ఎంపీ టిక్కెట్టు ఇవ్వాలని సునీత గట్టిగా అడుగుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రిపోర్ట్ ఏమాత్రం తేడాగా ఉన్నా జేసీ బ్రదర్స్ రాజకీయం తిరిగి తాడిపత్రికే పరిమితం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మహానాడులోరచ్చ ఎందుకనే వాయిదా
విషయాన్ని స్పష్టంగా తెలుసుకున్న చంద్రబాబు గుప్తాను చేర్చుకుంటే చౌదరి, గౌడ్ అన్నంత పని చేస్తారేమోనని.. అదే జరిగితే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు పూర్తిగా దారి తప్పి మీడియా దృష్టి, రాజకీయ పార్టీల చర్చ ఎమ్మెల్యేల ధిక్కార స్వరంపైనే ఉంటుందని భావించినట్లు సమాచారం. దీంతోనే చేరికను వాయిదా వేసినట్లు తెలిసింది. దీనిపై దివాకర్‌రెడ్డి ఓ సీనియర్ నేతను ఆరా తీయగా.. ‘మహానాడులో చేరికలు ఉండవని, తర్వాత చుద్దాం’ అని మొదట చెప్పగా.. ‘సీఎం క్యాంపు ఆఫీసులో చేరిక కార్యక్రమం నిర్వహిద్దాం’ అని జేసీ సలహా ఇచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత సదరు సీనియర్ నేత ‘ఇప్పుడు వద్దులేండి, మహానాడు తర్వాత పెట్టుకుందాం’ అని బాబు చెప్పినట్లు సర్దుబాటు చేశారని విశ్వసనీయంగా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment