ఆలూరు టీడీపీ మినీ మహానాడులో తోసుకుంటున్న ఇరువర్గాల కార్యకర్తలు
ఆలూరు: ఆలూరు నియోజకవర్గ టీడీపీ నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఇందుకు మినీ మహానాడు వేదికైంది. బుధవారం కర్నూలు–బళ్లారి రోడ్డు సమీపంలోని సెయింట్ జాన్స్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్‌లో టీడీపీ ఇన్‌చార్జ్ వీరభద్రగౌడ్ అధ్యక్షతన మినీ మహానాడు నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పరిశీలకుడు జకీవుల్లా, మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లు..నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జ్ వైకుంఠం మల్లికార్జున చౌదరిని ఉద్దేశించి ఆలూరులో టీడీపీ రెండో కార్యాలయం ప్రారంభించడం వెనక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఆగ్రహించిన మల్లికార్జున చౌదరి వేదిక పై నుంచే మైకును తీసుకుని తనను నమ్ముకున్న వారిని, పార్టీ కార్యకర్తలను కాపాడుకునేందుకేనని సమధానం చెప్పడంతో వీరభద్రగౌడ్ వర్గీయులు సభ ముందు గందరగోళం సృష్టించారు. గట్టిగా కేకలు వేశారు.
దీంతో మనస్తాపం చెందో, మరేమో తెలియదు కాని సభ వేదిక నుంచి వైకుంఠం మల్లికార్జున నిష్క్రమించారు. పక్కనే ఉన్న ఆయన అనుచరులు వీరభద్ర గౌడ్ డౌన్‌డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు చొక్కాలు పట్టుకుని తోసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసినా పరిస్థితి అదుపుకాలేదు. కొందరు పోలీసులపైనే దురుసుగా ప్రవర్తించారు. ఒకానొక దశలో ఇరువర్గాల వారు రాళ్లు రువ్వుకునే పరిస్థితి కనిపించడంతో పార్టీకార్యకర్తలు భయాందోళన చెందారు. ఇదిలా ఉంటే మినీ మహానాడుకు తమకు ఆహ్వానం అందలేదని పలువురు సీనియర్ నాయకులు, మాజీ మార్కెట్ చైర్మన్ హనుమంతప్ప, చిట్టెం చెన్నయ్య శెట్టి, మల్లయ్య,రామారావు నాయుడు, ప్రభాకర్ నాయుడు, హొళగుంద మాజీ జెడ్పీటీసీ సభ్యులు గజ్జెహల్లి తిమ్మారెడ్డి, రామలింగా రెడ్డి, మొలగవల్లి సుబ్బారెడ్డి తదితరులు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment