
ఎన్టీఆర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళుల అర్పిస్తున్న అహ్మదుల్లా, అష్రఫ్
కడప రూరల్: నందమూరి తారకరామరావు జయంతి..వర్ధంతి, కార్యక్రమం ఏదైనా సరే తమ్ముళ్ల మధ్య ఉన్న విభేదాలు ప్రతిసారీ బహిర్దతం కావడం సర్వ సాధారణంగా మారింది. ఇప్పుడు కడప టీడీపీలో గురువారం కొత్తగా పార్టీలో చేరి, కడప నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టిన మాజీ మంత్రి అహ్మదుల్లా తనయుడు అష్రఫ్ ఎఫెక్ట్ ఆ పార్టీ తమ్ముళ్లపై పడింది. ఏకపక్షంగా సాగుతున్న ఈ పరిణామాలను ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో శుక్రవారం ఐక్యమత్యంగా నిర్వహించుకోవాల్సిన ఎన్టీఆర్ 23వ వర్ధంతి కార్యక్రమానికి పలువురు నేతలు గైర్హాజరయ్యారు.
అనుకున్న విధంగానే వర్ధంతినిబహిష్కరించిన తమ్ముళ్లు...
విజయవాడలో సీఎం చంద్రబాబునాయుడు కడప నియోజక ఇన్‌చార్జిగా అష్రఫ్‌ను ప్రకటించగానే, కడపలో ఆ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. పార్టీ మైనార్టీ సెల్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు అమీర్‌బాబు ఇంట్లో పలువురు నేతలు సమావేశమై, తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిరసనగా ఎన్టీఆర్ వర్ధంతిని బహిష్కరిస్తామని ప్రకటించారు. ఆ మేరకు స్ధానిక ఎన్టీఆర్ కూడలి వద్ద నిర్వహించిన కార్యక్రమానికి ఆ పార్టీ నాయకులు అమీర్‌బాబు, దుర్గాప్రసాద్, ఆరీఫుల్లా, బాలక్రిష్ణయాదవ్ తదితరులు హజరు కాలేదు.
పార్టీ జిల్లా అధ్యక్షునిపై తమ్ముళ్ల ఫైర్..
వర్ధంతి కార్యక్రమం వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డిపై పలువురు నాయకులు బహిరంగంగానే అసంతృత్తిని వెళ్లగక్కారు. పార్టీ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు సుభాన్‌బాషా మాట్లాడుతూ శ్రీనివాసులురెడ్డిని జిల్లా అధ్యక్షులుగా తొలగించిన తరువాతనే ఎన్నికలకు పోవాలన్నారు. ఆయన వల్ల కార్యకర్తలకు ఏమాత్రం న్యాయం జరుగడం లేదన్నారు. హరిప్రసాద్ మాట్లాడుతూ కొత్త వారు రావడంతో ఎన్నో ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. మొత్తం మీద అహ్మదుల్లా, అష్రఫ్ చేరికతో విభేదాలు భగ్గుమన్నాయి.
స్థానిక ఎన్టీఆర్ కూడలి వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహనికి అహ్మదుల్లా, అష్రఫ్‌లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమకు అప్పగించిన బాధ్యతల పట్ల కృతజ్ఙతలు వ్యక్తం చేశారు. తరువాత రక్తదానం శిబిరంలో పాల్గొన్నారు.
కడపలో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హజరైన మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి ఎన్టీఆర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివా ళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రజల మనిషి అన్నారు. తాను ఆయన కుమార్తెగా జన్మించడం తన అధృష్టమని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment