తమ్ముళ్ల మధ్య ముసలం | tdp leaders fight on neeru chettu permissions | Sakshi
Sakshi News home page

తమ్ముళ్ల మధ్య ముసలం

Published Tue, Oct 24 2017 9:56 AM | Last Updated on Sat, Oct 20 2018 5:39 PM

tdp leaders fight on neeru chettu permissions

ఎల్‌.ఎన్‌.పేట: వచ్చే ఏడాది మే తర్వాత సాధారణ, స్థానిక సంస్థల్లో ఏవైనా ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎన్నికల సంఘం అధికారులు కూడా ప్రకటించిన తరుణంలో.. అధికార పార్టీలో ముసలం ప్రారంభమవుతోంది. మండల స్థాయి నాయకులు ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నా ఇప్పటివరకూ అణిగిమణిగి ఉన్న కొందరు నాయకులు.. కొన్ని రోజులుగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. గ్రామ, పంచాయతీ స్థాయిలో తామంతా కలసి పనిచేస్తే కొందరు మండల స్థాయిలో గద్దెనెక్కుతున్నారని వీరు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మండల నాయకుల తీరును కట్టడి చేయాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ కూడా వారినే వెనకేసుకొస్తుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వీరి తీరుతో విసిగివేశారిపోయిన కొందరు తమ్ముళ్లు పార్టీని వదిలేందుకు కూడా సిద్ధమవుతున్నారనే ప్రచారం ఊపందుకుంది.

చేతులెత్తేసిన ఎమ్మెల్యే
ఈ విషయం తెలుసుకున్న మండల నాయకులు మరో మంత్రి కళా వెంకట్రావు వద్దకు వెళ్లి పనులు రద్దు కాకుండా చర్యలు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ‘మా పైనే వ్యతిరేకంగా జిల్లా నాయకులకు చెబుతారా’ అని కక్షకట్టిన ఓ నాయకుడు పీఆర్‌ ఇంజినీరింగ్‌ అధికారులను పిలిపించుకుని మండలంలోని దబ్బపాడు, పెద్దకొల్లివలస, ముంగెన్నపాడు, ధనుకువాడ, టి.కృష్ణాపురం, కొమ్మువలస సర్పంచ్‌లు తనకు తెలియకుండా ఏ పనులు ప్రారంభించకూడదని, బిల్లులు చెల్లించకూడదని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పలువురు సర్పంచ్, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తలు మండల నాయకుల తీరుపై భగ్గుమంటున్నారు. విషయాన్ని ఎమ్మెల్యే కలమట దృష్టికి తీసుకువెళ్లినా తానేమీ చేయలేనని చేతులెత్తేయడంతో.. ‘అవసరమైతే పార్టీ మారుదాం.. లేదంటే పార్టీలో కొనసాగుతూనే వీరికి వ్యతిరేకంగా పనిచేద్దామ’ని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  

నీరు–చెట్టు పనుల పర్సంటేజీల స్వాహా
2016–17 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన నీరు–చెట్టు పనులకు సంబంధించి మండలంలో పలువురు సర్పంచ్‌లు, ఎంపీటిసీలు, జన్మభూమి కమిటీ సభ్యులు, ముఖ్య నాయకుల వద్ద ఇరిగేషన్‌ అధికారులకు, ప్రెస్‌కు ఇవ్వాలని వసూలు చేసిన సుమారు రూ.16 లక్షల పర్సంటేజీలు నాయకులే స్వాహా చేశారని ఏడాదిగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. విషయాన్ని ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ప్రభుత్వ విప్‌ కూన రవి, ఎమ్మెల్యే కలమటకు తెలియజేసినా వారినే వెనకేసుకువస్తున్నారని దిగువస్థాయి నాయకులు అసంతృప్తిలో ఉన్నారు. ‘పార్టీకి, జిల్లా నాయకులకు వారే కావాలి గాని గ్రామస్థాయిలో కష్టపడే సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు అవసరం లేదా?’ అని బాహాటంగా ప్రశ్నిస్తున్నారు.

ఇలా మొదలైంది..
మండల నాయకులు రెండు పంచాయతీల్లో రూ.2 కోట్లు విలువ చేసే నీరు–చెట్టు పనులు ఎంపీ రామ్మోహన్‌నాయుడి సిఫార్స్‌ లేఖతో మంజూరు చేయించుకున్నారు. విషయాన్ని తెలుసుకున్న మండల స్థాయిలో పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులతో పాటు సీనియర్‌ నాయకులు జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే కలమట వద్దకు వెళ్లి నియోజకవర్గంలో 140, ఎల్‌.ఎన్‌.పేట మండలంలో 19 పంచాయతీలు ఉన్నాయని.. కానీ ఆ రెండు పంచాయతీలకే రూ.2కోట్ల పనులు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. పనులు రద్దు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పి, ఇరిగేషన్‌ ఈఈతో మాట్లాడారు. దీంతో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు శాంతించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement